‘ఐ లవ్ యూ.. యూ లవ్ మీ..’ అని బతిమాలుకొనేది ఒక తరహా ప్రేమ కథ.
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా – నువ్వు కూడా నన్ను ప్రేమించాల్సిందే’ అని బలవంతం చేసేది మరో తరహా లవ్ స్టోరీ.
మూగ ప్రేమలది మరో దారి.
కానీ… ‘నువ్వు నన్ను ప్రేమించకపోయినా ఫర్వాలేదు.. నా ప్రేమను ఫీలవ్వు చాలు’ అనడం – షాకింగ్ & థ్రిల్లింగ్. ప్రేమకు అదో కొత్త ఆలోచన. ఫ్రెష్ ఎక్స్ప్రెషన్. అదే ట్రెండ్ సెట్టర్ ‘ఆర్య’. ప్రేమకథల్లో కొత్తకోణం ఆవిష్కరించిన ఈ సినిమాకు నేటితో సరిగ్గా 20 ఏళ్లు.
‘మీకు నచ్చిన లవ్ స్టోరీలేంటి?’ అని ఎవర్నయినా అడిగి చూడండి. ఆ లిస్టులో ‘ఆర్య’ తప్పకుండా ఉంటుంది. దేవదాస్, గీతాంజలి, ఆర్య – ఇవన్నీ, ప్రేమకథా చిత్రాలకు ఓ కొత్త కుదుపు ఇచ్చిన ఆలోచనలు. ఆ సినిమాలతో ప్రేమలో పడిపోవడంలోనూ, ఆ సినిమా ప్రభావంతో ప్రేమలో మునిగిపోవడంలోనూ వింతలూ విడ్డూరాలూ ఉండవు.
అప్పటికి మూడంటే మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు సుకుమార్. ‘దిల్’ సినిమాకు పని చేసేటప్పుడే ఓ కథ అల్లుకొన్నాడు. ఆ సినిమా సెట్స్‌లోనే దిల్ రాజు సుకుమార్‌లోని చురుకుదనాన్ని గ్రహించాడు. ‘మంచి కథ ఉంటే చెప్పు.. దిల్ హిట్ అయితే నీకు ఛాన్స్ ఇస్తా’ అంటూ ఆఫర్ ఇచ్చాడు. సుకుమార్ అదృష్టమో, వినాయక్ కష్టమో.. ‘దిల్’ సూపర్ హిట్టయ్యింది. దిల్ రాజు బ్యానర్లో సుక్కు సినిమా ఖాయమైంది.
అయితే దిల్ రాజు ఆలోచనలు వేరుగా ఉన్నాయి. ఓ తమిళ సినిమాని కొని, ‘దాన్ని రీమేక్ చేయ్..’ అన్నాడు. మరొకరైతే.. ఏదో ఒకటి, డైరెక్టర్ అయితే చాలు అనుకొంటారు. కానీ సుక్కూ అక్కడ! ‘వేరే కథలకు న్యాయం చేయలేను.. నా దగ్గర ఓ కథ ఉంది. అదైతేనే చేస్తా’ అంటూ తన ఐడియా చెప్పాడు. దిల్ రాజుకి కథ నచ్చింది కానీ, మనసులో ఎక్కడో డౌటు. కమర్షియల్ గా వర్కవుట్ అవుతుందా? అనే అనుమానం. అందుకే కథ విన్న వెంటనే మాట ఇవ్వలేకపోయాడు. అయితే అదే కథని ఇద్దరు ముగ్గురు దర్శకుల దగ్గర ప్రస్తావిస్తే ‘సూపర్ థాట్.. కచ్చితంగా హిట్ అవుతుంది’ అని భరోసా ఇచ్చారు. దాంతో దిల్ రాజులో ఉత్సాహం వచ్చేసింది. ‘సరే.. మనం చేసేద్దాం’ అంటూ సుకుమార్‌తో చేతులు కలిపాడు.
మరి హీరో ఎవరు?
అక్కడే బండి ఆగింది. ఇలాంటి లవ్ స్టోరీల్ని నమ్మడంలో రిస్క్ వుంది. కొత్త థాట్ కదా, వెంటనే ఒప్పుకోరు. నితిన్, ప్రభాస్, రవితేజ… ఇలా ఈ కథ తిరుగుతూనే ఉంది. ‘దిల్’ సినిమా ప్రసాద్ లాబ్ లో సెలబ్రెటీల కోసం స్పెషల్ షో వేస్తున్నప్పుడు బన్నీ అక్కడికి వచ్చాడు. అప్పటికే ‘గంగోత్రి’ రిలీజ్ అయ్యింది. రెండో సినిమా కథ కోసం బన్నీ, అల్లు అరవింద్ కథల వేటలో ఉన్నారు. దాదాపు 60 -70 కథలు విని అలసిపోయారు. ఆ సమయంలోనే బన్నీని చూశాడు సుకుమార్. ‘నా కథకు ఇతనే కరెక్ట్’ అనుకొన్నాడు. వెంటనే బన్నీకి కథ చెప్పడం, బన్నీ ఓకే అనేయడం జరిగిపోయాయి. అయితే అల్లు అరవింద్ కి మాత్రం ఈ కథ సరిగ్గా ఎక్కలేదు. సెకండాఫ్‌లో కొన్ని మార్పులు సూచించారు. వారం పది రోజుల్లో అరవింద్ చెప్పిన మార్పులతో సరికొత్త వెర్షన్ తయారైంది. పూర్తిగా సంతృప్తి చెందిన అరవింద్.. ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అలా.. ‘ఆర్య’ సినిమా పట్టాలెక్కింది. ఈ సినిమా కోసం ముందు `నచికేత` అనే టైటిల్ అనుకొన్నారు. కానీ దిల్ రాజుకి నచ్చలేదు. ‘టైటిల్ మార్చు..’ అన్నారు. వెంటనే చిన్నపిల్లల పేర్ల పుస్తకం ఒకటి తెప్పించాడు సుకుమార్. అందులో మొదట ఆయన చూసిన పేరు.. ‘ఆర్య’. హీరోకీ, సినిమాకీ అదే పేరు ఫిక్స్ చేసేశారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలన్నీ హిట్టే. ‘ఆ అంటే అమలాపురం’ ఐటెమ్ గీతాల్లో ట్రెండ్ సృష్టించింది. గంగోత్రిలోని బన్నీకీ, ఆర్యలోని బన్నీకి చాలా తేడా కనిపించింది. లుక్స్ లోనే కాదు, నటనలోనూ చాలా పరిణితి చూపించాడు. రూ.3 కోట్లతో తయారైన ఈ సినిమా దాదాపు రూ.30 కోట్లు సాధించింది. దిల్ రాజు బ్యానర్ నిలబడిపోవడానికి ‘ఆర్య’ సినిమా కూడా ఓ కారణమే.
‘ఆర్య’లో సీన్లన్నీ చాలా ఫ్రెష్‌గా కనిపిస్తాయి. బన్నీ లవ్ ప్రపోజ్ చేసే సీన్, తన ప్రేమని వ్యక్త పరిచే సన్నివేశాలు, భావోద్వేగాలు, లవ్ లెటర్ని చదివి వినిపించే సీన్ డిజైనింగ్… ఇవన్నీ చాలా కొత్తగా అనిపించాయి. స్క్రీన్ ప్లే విషయంలో తొలి సినిమాతోనే మార్కులు కొట్టేశాడు సుకుమార్. ఇప్పుడు చూసినా ‘ఆర్య’ అంతే కొత్తగా అనిపిస్తుంటుంది.
ఈ చిత్రాన్ని మలయాళంలో డబ్ చేశారు. బన్నీకి మల్లూవుడ్ లో ఆదరణ పెరగడానికి ఈ సినిమా బీజం వేసింది. ఒడియాలోనూ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. నంది పురస్కారాల్లో 4 అవార్డుల్ని కూడా దక్కించుకొంది. బన్నీ – సుకుమార్ ల స్నేహానికి బలమైన పునాది వేసింది. ఆ స్నేహం ఇప్పుడు ‘పుష్ష’ వరకూ వచ్చింది.