ఎన్నికల నిర్వహణ ఎంత అసమర్థుల చేతుల్లో ఉందో తెలిపే ఘటన ఇది. పల్నాడు జిల్లాలో చిలకలూరిపేట లో పోస్టల్ బ్యాలెట్లకు బదులు ఉద్యోగులకు డమ్మీ బ్యాలెట్లు ఇచ్చారు. రోజంతా ఉద్యోగులు కష్టపడి ఎండల్లో వచ్చి ఓట్లు వేశారు. చివరికి అవన్నీ చెల్లవని తేలింది. ఇలాంటి తప్పులు కూడా జరుగుతాయా అని ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బ్యాలెట్ పేపర్‌కు బదులుగా చిలకలూరిపేట పోస్టల్ బ్యాలెట్ పేపర్ ఫెసిలిటేషన్ సెంటర్ లో ఓటర్లకు EVM/టెండర్డ్ బ్యాలెట్ పేపర్ ఇచ్చారు. ఇలా మే 5 వ తేది పోల్ అయిన 1219 ఓట్లను చెల్లనివిగా ప్రకటించారు. ఈ సీల్డ్ బాల్ పేపర్లను అలాగే ఉంచుతారు, మరియు వీటిని కౌంటింగ్ లో పరిగణలోకి తీసుకోరని ఈసీ ప్రకటించింది. ఈ 1219 మంది పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగులు మరల తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తామని రీ పోలింగ్ నిర్వహిస్తామని అంటున్నారు. మే 6వ తారీకు అనగా సోమవారం వేసిన పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయి. ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
CEO ఆదేశాల మేరకు దీనికి బాధ్యులైన ఉన్నతాధికారులపై చర్యలు ఉంటాయని చెబుతున్నారు. అసలు పోస్టల్ బ్యాలెట్ కు డమ్మీ బ్యాలెట్ కు తేడా తెలియనంత ఘోరంగా అధికారులు ఉంటారా అంటే ఉంటారని నిరూపించారు. వీళ్లా ఎన్నికలు సజావుగా నిర్వహించేది అని జనాలకు అనుమానం వస్తే అది వారి తప్పెలా అవుతోంది. ఇప్పుడు మళ్లీ ఉద్యోగులు రీపోలింగ్ లో పాల్గొనాలంటే ఎన్నికల విధులకు మరో సారి దూరం కావాల్సి ఉంటుంది.