పవన్ ని గెలిపించడానికి చిరంజీవి సైతం రంగంలోకి దిగారు. పిఠాపురం నుంచి పవన్ ని గెలిపించాలని, జనం కోసం ఆలోచించే పవన్ని చట్టసభలకు పంపాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వీడియోని విడుదల చేశారు చిరంజీవి. సినిమాల్లోని బలవంతంగా అడుగుపెట్టినా, రాజకీయాల్లోకి ఇష్టపూర్వకంగానే పవన్ వచ్చాడని, అలాంటి వ్యక్తిపై నిందలు వేస్తుంటే అమ్మతో పాటు తాను కూడా బాధ పడ్డానని, అయితే ఎంతోమంది అమ్మలకు న్యాయం చేయడానికే పవన్ రాజకీయాల్లోకి వెళ్లాడని సర్దిచెప్పుకొన్నామని చిరు చెప్పారు. ప్రజల కోసం సొంత డబ్బుని ఖర్చు చేసే పవన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండాలని, అప్పుడే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని చిరు ఆకాంక్షించారు. జనసేన పార్టీ స్థాపించి పదేళ్లయ్యింది. ఈ దశాబ్దకాలంలో పరోక్షంగా చిరు జనసేనకు అండదండలుగా ఉన్నారేమో కానీ. చిరంజీవి నేరుగా పవన్ కోసం రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. ఇటీవల జనసేనకు రూ.5 కోట్లు విరాళంగా ఇచ్చి, తమ్ముడికి అండగా నేనున్నా అనే సంకేతాలు పంపారు. ఇప్పుడు నేరుగానే తన గళం వినిపించారు. చిరు పిలుపు.. పిఠాపురం ఓట్లపై మరింత ప్రభావం చూపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే పిఠాపురంలో పవన్ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. అందరి లెక్కలూ మెజార్జీ ఎంత అన్నదానిపైనే. లక్ష ఓట్ల మెజార్టీ సాధ్యమేనని జనసైనికులు భావిస్తున్నారు. చిరు కూడా అండగా ఉన్నాడు కాబట్టి, లక్ష మెజార్టీ సాధ్యమే అనిపిస్తోందిప్పుడు.
ప్రచారానికి వెళ్తారా?
జబర్దస్త్ టీమ్ ఇప్పుడు పిఠాపురంలోనే ఉంది. వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ పిఠాపురం అంతా చక్కర్లు కొట్టారు. ఇప్పుడు పిఠాపురంలో చిరు సైతం అడుగుపెడతారని, పవన్ కోసం ప్రచారం చేస్తారని వార్తలొచ్చాయి. అయితే.. చిరు పిఠాపురం వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు చిరు చంద్రబాబుతో భేటీ వేయనున్నారని, త్వరలోనే టీడీపీ అధినేతని కలుస్తారని వార్తలొస్తున్నాయి. వీటిపై చిరు పీఆర్ టీమ్ కూడా ఏం చెప్పలేకపోతోంది. మరి చిరు మనసులో ఏముందో చూడాలి.