‘కార్తికేయ 2’తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వరకు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్షన్ సీన్ తీయడానికి రూ.8 కోట్లు ఖర్చు పెట్టించే స్థాయికి చేరుకొన్నాడు. నిఖిల్ కెరీర్లో ఇది ఊహించని మార్పు.
నిఖిల్ తాజా చిత్రం ‘స్వయంభూ’ శరవేగంగా రూపుదిద్దుకొంటోంది. సంయుక్త, నభా నటేషా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కృష్ణమాచారి దర్శకుడు. పిక్సల్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలోని ఓ కీలకమైన యాక్షన్ సన్నివేశం కోసం రూ.8 కోట్లు ఖర్చు పెట్టారు. 12 రోజుల పాటు దాదాపు 700మంది జూనియర్ ఆర్టిస్టులు, ఫైటర్ల మధ్య ఈ యాక్షన్ సన్నివేశం రూపొందించారు. ‘స్వయంభూ’లోని ప్రధాన ఆకర్షణల్లో ఈ యాక్షన్ ఎపిసోడ్ ఒకటని నిర్మాతలు చెబుతున్నారు. ‘స్వయంభూ’లో నిఖిల్ ఓ యుద్ధ వీరుడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం నిఖిల్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకొన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. త్వరలోనే ఓ గ్లింప్స్ ని విడుదల చేసే అవకాశం ఉంది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.