బ్యాంకులను జాతీయం చేస్తే సామాన్యులకు మేలు జరుగుతుందనేది భ్రమే అనేది విషయం రుజువై చాలా కాలమైంది. వేల కోట్లు అప్పుగా తీసుకుని ఎగ్గొట్టే వారిమీదే చాలా బ్యాంకులకు అపారమైన ప్రేమ. దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎగవేతదారుల రుణాలను రానిబాకీల ఖాతాలో జమ చేయడంలోనూ నంబర్ వన్ గా ఉంది. ప్రతి భారతీయుడి బ్యాంకర్ అని చెప్పుకుంటున్న ఈ బ్యాంక్ తీరు చూస్తే మాత్రం, ప్రతి ఎగవేతదారుడి బ్యాంకర్ అనాలేమో అనిపిస్తుంది.
ఎస్ బి ఐ మూడో త్రైమాసిక ఫలితాలను చూస్తే, ఎగవేతదారుల బ్యాంకుగా దీనికి ఓ బ్రాండ్ ఇమేజి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని అర్థమవుతుంది. గత డిసెంబర్ తో ముగిసిన క్వార్టర్లో బ్యాంక్ నికర లాభం 67 శాతం పడిపోయింది. బ్యాంక్ మొండి బాకీలు (ఎన్ పి ఎ) 40.8 శాతం, అంటే 40 వేల 249 కోట్ల రూపాయలకు పెరిగాయి. మొండి బాకీల రైటాఫ్ లోనూ ఎస్ బి ఐ టాప్ పొజిషన్లో ఉంది. ఈ బ్యాంక్ రైటాఫ్ చేసిన రుణాల మొత్తం రూ. 21,313 కోట్లు. నెంబర్ టూ పొజిషన్లో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ. 6,587 కోట్లు రైటాఫ్ చేసింది.
ఎస్ బి ఐ చైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న కొత్తలో అరుంధతీ భట్టాచార్య క్రమ శిక్షణ గురించి, అంటే క్రెడిట్ డిసిప్లిన్ గురించి ఎక్కువగా మాట్లాడే వారు. అంటే, రుణాలు తీసుకున్న బక్క రైతులు, సామాన్యులు చచ్చినట్టు ఠంచనుగా తీర్చాలనేది ఆమె ఉద్దేశం కావచ్చు. వేల కోట్లు ఎగ్గొట్టే బడా కార్పొరేట్ మోసగాళ్ల గురించి మాత్రం ఆమె పెద్దగా మాట్లాడటం కనిపించదు. రుణాలు మాఫీ చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణ, ఏపీల్లో ఆమధ్య రైతులు అప్పులు చెల్లించడం మానేశారని ఆమె ఆవేదన వెళ్లగక్కారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పద్ధతి ప్రకారం ప్రక్రియను పాటిస్తున్నాయి. అయితే, రైతుల గురించి ఇంత మాట్లాడిన ఆమె, ఎందరు రైతులు లక్షా, రెండు లక్షల రూపాయల రుణాలు ఎగ్గొడితే 7 వేల కోట్లవుతాయో చెప్పడం లేదు.
పోనీ తన బ్యాంక్ కు రూ. 1600 కోట్లు ఎగ్గొట్టిన మాల్యాకు ఆనాడు ఏ గ్యారంటీ చూసి రుణం ఇచ్చారో ఆమె వివరాలు చెప్తారేమో చూడాలి. ఎంత మంది బక్కరైతులు పంట రుణాలను ఎగ్గొడితే 1600 కోట్లవుతాయో కూడా సెలవిస్తే బాగుండు.
ఓ వైపు మూడు నాలుగేళ్లుగా విజయ్ మాల్యా కంపెనీ రుణం చెల్లించకుండా సతాయిస్తోంది. ఈ సంగతి తెలుసు. అయినా ఇటీవలే మరో బడా కంపెనీకి ఆస్ట్రేలియాలో కోల్ ప్రాజెక్టుకు బిలియన్ డాలర్ల రుణం ఇవ్వడానికి ఎస్ బి ఐ ఉదారంగా ఓకే చెప్పింది. ఆగమేఘాల మీద ఆ కంపెనీతో ఎం ఒ యుపై సంతకం చేసేసింది. ఇది తప్పేం కాదని అరుంధతీ భట్టాచార్య ఘంటాపథంగా సమర్థించుకున్నారు. సదరు కంపెనీకి అదే ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి ఐదు విదేశీ బ్యాంకులు నో చెప్పాయి. అలాంటిది సదరు ఎస్ బి ఐ మాత్రం అంత భారీ రుణం ఇవ్వడానికి ఏమి గ్యారంటీ పెట్టుకుందో చెప్పలేదు. బిలియన్ డాలర్లంటే మన కరెన్సీలో 6 వేల 700 కోట్ల రూపాయలకు పైమాటే. అంటే, 17 బ్యాంకులకు మాల్యా కంపెనీ బాకీ ఉన్న మొత్తానికి సమానం. ఇంత భారీ లోన్ తీసుకోవడానికి దానికి సమానమైన గ్యారంటీ ఇవ్వాలి కదా. అలా లేకుండా లోన్ ఇవ్వడానికి సిద్ధపడ్డారంటే విజయ్ మాల్యా మొండి బాకీ నుంచి కూడా పాఠం నేర్చుకోలేదని అనుకోవాలా?
విజయ్ మాల్యా మొండిబాకీ కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా మారింది. అయినా అతడిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించడానికి ఎస్ బి ఐ మీనమేషాలు లెక్కించింది. సీబీఐకి ఫిర్యాదు చేయాలనే విషయమే మరచిపోయింది. చివరకు నాలుగైదు నెలల కింద విల్ ఫుల్ డిఫాల్టర్ గా ప్రకటించి మమ అనిపించింది. అంతేగానీ, అంతభారీ మొత్తం ఎగ్గొట్టి జల్సాలు చేస్తున్న వ్యక్తి నుంచి రుణాన్ని వసూలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని స్పష్టంగా కనిపిస్తుంది. బడా ఎగవేతదారులపై ఈ బడా బ్యాంకుకు అంత ప్రేమ ఎందుకో మనకూ చెప్తే బాగుండు. మనం కూడా ఆ విధంగానే రుణాలు తీసుకోవడానికి చాన్స్ ఉందేమో చూద్దాం !!