మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం వచ్చిందంటే… మోదీ సభలో మాట్లాడిన పవన్ స్పీచ్ రాజేష్ కు నచ్చలేదట. అందలో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల సీట్లు వచ్చేందుకు తాను ప్రాణత్యాగం అయినా చేస్తానని తనదైన శైలిలో పవన్ చెప్పారు. అందకే నచ్చలేదట రాజేష్ సరిపెల్లకు. ఆ మాటల్ని అడ్డం పెట్టుకుని పవన్ ను ఓడిస్తామని.. జనసేనకు ఓట్లేయమని అవసరమైతే వైసీపీకి వేసుకుంటామన్నారు.
అయితే పవన్ పై తన కోపం ఇది కాదని.. తనను జనసేన పట్టించుకోకపోవడం అని.. తన వీడియో ఆరంభంలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో తేలిపోయింది. తనను తాను జన సైనికుడిగా ప్రకటించున్నా… పట్టించుకోలేదన్నారు. తాను కూటమి తరపున సభలు పెడుతున్నా.. ప్రచారం చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. జనసేన వైపు నుంచి తనను గుర్తించడం లేదన్న కారణంతో మహాసేన రాజేష్ కోపంతో ఈ వీడియో చేసినట్లుగా కనిపిస్తోంది.
రాజకీయాల్లో ఎలా ఉండకూడదో అలానే ఉంటూ దళిత వాయిస్ గా … మంచి పేరు తెచ్చుకుంటారని అందరూ అనుకున్న మహాసేన రాజేష్.. పదే పదే యూటర్నులతో అందరూ తేలికగా తీసుకునే నేతగా మారిపోతున్నారు. పి.గన్నవరం టిక్కెట్ టీడీపీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారు. తర్వాత చంద్రబాబు ప్రత్యేకమైన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినా..తర్వాత మహాసేన తరపున అభ్యర్థుల్ని నిలబెడతామన్నారు. మళ్లీ కూటమికి మద్దతు పలికారు. కూటమి తరపున ప్రచారానికి షెడ్యూల్ వస్తే ఓకే చేశారు. మళ్లీ ఇప్పుడు పవన్ ను ఓడిస్తామని వీడియోలు చేశారు.
గతంలో మహాసేన రాజేష్ చేసే వీడియోలకు పాజిటివ్ కామెంట్స్ వచ్చేవి. కానీ లాజిక్ లేకుండా.. మనసులో ఇంకేదో పెట్టుకుని పవన్ ను విమర్శించడం ప్రారంభించిన వీడియోకు మాత్రం ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కామెంట్ రాలేదు. ఆయన వైసీపీ ఇన్ ఫ్లూయన్స్ కు గురయ్యాడని ఎక్కువ మంది భావిస్తున్నారు.