చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఐదేళ్లలో సంపాదించినదే కాదు.. టిక్కెట్ల కసరత్తులోనూ పార్టీ ఫండ్ పేరుతో చాలా సమీకరించారు. అయినా ఇప్పుడు బీద అరుపులు అరుస్తూండటంతో.. తమకు ఓట్ల కొనుగోలకు పంపుతామన్న డబ్బులకు టెండర్ పెడతారేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
నిజానికి చాలా చోట్ల అభ్యర్థులకు వైసీపీ హైకమాండ్ భరోసా ఇచ్చింది. ప్రచారం కోసం మీరు ఎంతైనా ఖ్చుపెట్టుకోండి.. డబ్బుల పంపిణీ గురించి మాత్రం తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ ప్రకారం అంతా ధీమాగా ఉన్నారు. చాలా నియోజకవర్గాలకు అపరిచత వ్యక్తుల్ని పంపారు. అపరిచితులు అంటే ఆ నియోజకవర్గానికి సంబంధం లేని వారు కడప, కర్నూలుకు చెందిన వారు. వారు వచ్చి.. గ్రామాల వారీగా.. పంపిణీ బాధ్యతలు తీసుకుంటున్నారు. ఈ సమయంలో తన దగ్గర డబ్బుల్లేవన్న వాదన జగన్ తెరపైకి తేవడం ఆసక్తికరంగా మారింది.
ఈ సారి వైసీపీ వైపు నుంచి కనీసం ఐదు వేలు ఓటుకు వస్తాయని ఎక్కువ మంది ఆశలు పెట్టుకుంటున్నారు. మద్యం, ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడినంతా ఇప్పుడు పంచుతారని అనుకుంటున్నారు. కానీ గెలిచే అవకాశం లేకపోవడంతో ఆ డబ్బును పంచడం కూడా దండగేనన్న ఆలోచనలకు వచ్చారన్న అనుమానాలు బలపడుతున్నాయి. అయితే తాను పంచడం లేదని చెప్పుకోవడానికి ఇలా చేస్తున్నారని.. టీడీపీ నేతలు పంచే దాని కన్నా రెట్టింపు పంచుతారని ఆ పార్టీ నేతలు నమ్మకంతో ఉన్నారు.