RRR…. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఓ చరిత్ర. వసూళ్ల పరంగా, రికార్డుల పరంగా, అవార్డుల పరంగానూ… ఈ సినిమాకు తిరుగులేదు. మల్టీస్టారర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు సినిమాని ఏకంగా ఆస్కార్ ముంగిట నిలబెట్టింది. అయితే ఈ సినిమాపైనా కొంతమందిలో అసంతృప్తి ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో. ఇందులో చరణ్ పాత్రతో పోలిస్తే, ఎన్టీఆర్ పాత్ర సైజు తగ్గిందని, ఎన్టీఆర్ స్టార్డమ్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని ఫ్యాన్స్ బాధపడిపోయారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా సాగింది. అయితే ఈ ఇష్యూపై రాజమౌళి ఎప్పుడూ స్పందించలేదు. ‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత ఆయన మీడియా ముందుకు వచ్చిందే లేదు. అయితే ‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్ హాట్ స్టార్‌లో రాబోతున్న సందర్భంగా.. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో మీడియా ముందుకు రావాల్సివచ్చింది. ఈ సందర్భంగా ‘ఎన్టీఆర్ పాత్రని తక్కువ చేసి చూపించారన్న కామెంట్స్‌పై మీ స్పందనేంటి’ అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది.
అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి రాజమౌళి నిరాకరించారు. ”ఇది సరైన సమయం కాదు, సరైన వేదిక కాదు” అంటూ సున్నితంగా తోసి పుచ్చారు. అయితే సమాధానం చెప్పేంత వరకూ ఈ ప్రశ్న రాజమౌళిని వెంటాడుతూనే ఉంటుంది. దానికి రాజమౌళి ఏదో ఓ రూపంలో, ఏదో ఓ సందర్భంలో సమాధానం చెప్పాలి. ఆయన మనసులో ఏమనుకొంటున్నారో అది బయట పెట్టాలి. అయితే అదెప్పుడు? అనేదే ప్రశ్న. `ఆర్.ఆర్.ఆర్` అయిపోయి, ఆయన మహేష్ సినిమాతో బిజీగా ఉన్న సమయం ఇది. మళ్లీ ఆయన `ఆర్.ఆర్.ఆర్` కాంట్రవర్సీలకు సమాధానం చెప్పడానికి ఇష్టం చూపించకపోవొచ్చు. మరి ఈ ప్రశ్నకు బదులేది?