కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని రేవంత్ రెడ్డి ఉబ్బేస్తున్నారు కానీ ఆయన పనితీరుపై హైకమాండ్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడంపై హైకమాండ్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల వ్యూహాలపై కేసీ వేణుగోపాల్ .. ఇంచార్జులతో సమావేశం నిర్వహించారు. ఇందులో కోమటిరెడ్డి తీరుపై వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారు. చెప్పిన పని ఎందుకు చేయడం లేదని.. పని చేసే వారికే పదవులు ఉంటాయని నేరుగానే చెప్పారు.
విషయం ఏమిటంటే… కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ సారి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బాధ్యతలు ఇచ్చారు. దానం నాగేందర్ ను పార్టీలోకి రప్పించి పోటీ చేయించేలా చేయడంలో ఆయన కూడా కీలక పాత్ర పోషించారు. అయితే హఠాత్తుగా ఆయన పట్టించుకోవడం మానేశారు. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకుంటున్నారు. దీనిపై ఆయనపై మంత్రి ఉత్తమ్ తో పాటు జానారెడ్డి నుంచి ఫిర్యాదులు వెళ్లాయి. నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడే పోటీ చేస్తున్నారు. దీంతో తాము చూసుకుంటమని కోమటిరెడ్డి జోక్యం అక్కర్లేదని అంటున్నారు. కానీ తన జోక్యం లేకపోతే… గెలుపులో క్రెడిట్ రాదనుుంటున్నారేమో కానీ వేలు పెట్టేస్తున్నారు. ఈ కారణంగానే ఆయనకు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చింది.
సికింద్రాబాద్ లో గెలవకపోతే సమస్యలు వస్తాయని కోమటిరెడ్డి అనుకుంటున్నారు. ఆయన సోదరుడు మంత్రి పదవి కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు. భువనగిరిలో గెలిపించి తీసుకు వస్తా మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. అప్పుడు కోమటిరెడ్డిని తొలగించి ఆయన తమ్ముడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వ్యవహారాలన్నీ చూస్తే.. కోమటిడ్డికి కాంగ్రెస్ లో ఉక్కపోత ప్రారంభమయిందని ఆ పార్టీలోని నేతలకే ఓ క్లారిటీ వస్తోంది.