ప్రతి ఏడాది మే రెండో ఆదివారం మదర్స్ డే గా జరుపుకుంటారని మనకు తెలుసు.. అయితే ఈ ప్రతిపాదన మొదలై 200 సంవత్సరాలు అయిందనే విషయం మీకు తెలుసా?
వాస్తవానికి ‘మదర్స్ డే వేడుకలు’ చేయాలనే సంస్కృతి తొలిత గ్రీస్ వారిది. గ్రీస్ లో రియా అనే దేవత ఉండేది ఆమెను ‘మదర్ ఆఫ్ గాడ్స్’ అని ఆరాధించేవారు… ఆ తర్వాత కాలంలో బ్రిటన్ లోను తమ తల్లుల్ని గౌరవించాలనే సంస్కృతి మొదలయింది. ఆ తర్వాత 1822 ప్రాంతంలో అమెరికాలో మదర్స్ డే కోసం ఒక పెద్ద ప్రతిపాదన జరిగింది. జూలియ వర్డ్ హోవే అనే మహిళ.. కన్నతల్లుల రుణం తీర్చుకునేందుకు ప్రతి సంవత్సరం మే రెండో ఆదివారం మదర్స్ డే ను నిర్వహించాలని ప్రతిపాదించింది. అయితే ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చి, అమలుకు నోచుకునే సరికి దాదాపు వందేళ్లు పట్టడం విశేషం.
ఇలా 1914 సంవత్సరం నుంచి అమెరికాలో మే రెండో ఆదివారం మదర్స్ డే గా నిర్వహించడం ప్రారంభించారు. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పట్నుంచి మే నెలలో వచ్చే రెండో ఆదివారం మాతృ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.
అయితే ఆధునిక పోకడల నేపథ్యంలో ‘మదర్స్ డే’ చాలా చోట్ల కార్యాలయాలకు, కాగితాలకే పరిమితం అవుతుంది. ఏడాదిలో ఒక్కరోజు తల్లిని గౌరవించామనో, పూజించామనో అంటే సరిపోదు. ఇప్పటికీ రోజు ఎక్కడో ఒక చోట కన్నతల్లిని రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన సంఘటనలు, పుష్కరాల్లో వదిలేసి వెళ్లిపోయిన సంఘటనలు.. ఇంట్లోంచి బయటికి తోసేసిన సంఘటనలు జరుగుతూనే ఉండటం బాధాకరం.
చిన్నప్పటి నుంచి తన పిల్లల్ని పెంచడం కోసం కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ ఉంటుంది కన్నతల్లి. అలాంటి తల్లికి గుడి కట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఆమె విలువను గుర్తించి, గౌరవించి.. చివరి దశలో ఆమె కోసం కొంత సమయం, కొంత బాధ్యత కేటాయిస్తే మాతృ దినోత్సవ యొక్క సంకల్పం నెరవేరినట్టు అవుతుంది.