బాహుబలి ఇప్పుడు యానిమేషన్ రూపంలో వచ్చింది. డిస్నీ హాట్ స్టార్ లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అయితే ‘బాహుబలి’ సినిమాకీ ఈ కథకూ ఎలాంటి సంబంధం ఉండదు. ఆ పాత్రలతో, ఆ క్యారెక్టరైజేషన్లతో రాసుకొన్న వేరే కథ. నిజానికి ఇలాంటి ఆలోచన రాజమౌళికి ఎప్పుడో వచ్చింది. బాహుబలి పాత్రలతో ఓ వెబ్ సిరీస్ తీద్దామనుకొన్నారు. నెట్ ఫ్లిక్స్ తో జోడీ కట్టి రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో సిరీస్ రూపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి. దేవాకట్టా, ప్రవీణ్ సత్తారు లాంటి దర్శకులు ఒకొక్క ఎపిసోడ్ డైరెక్ట్ చేశారు కూడా. కానీ.. అవుట్ పుట్ సరిగా లేకపోవడం ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్పటి వరకూ ఆ ప్రాజెక్ట్ పై ఖర్చు పెట్టిన డబ్బులన్నీ వృథా అయిపోయాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనల్లో రాజమౌళి ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్కా మీడియా వెబ్ సిరీస్ ని మళ్లీ పట్టాలెక్కించిందని సమాచారం. ‘బాహుబలి’ బ్రాండ్ ని వాడుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని శోభూ యార్లగడ్డ భావిస్తున్నారు. అందుకే.. ఆగిపోయిన ఆ వెబ్ సిరీస్ ని మళ్లీ పట్టాలెక్కించారు. నెట్ ఫ్లిక్స్ లోనే ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ ‘బాహుబలి’ వెబ్ సిరీస్ గనుక క్లిక్ అయితే, సూపర్ హిట్ అయిన సినిమాల్లోని పాత్రల్ని వాడుకొంటూ, కొత్త కథలు రాసుకొని, కొత్త తరహా వెబ్ సిరీస్‌లు నిర్మించడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే రోజుల్లో ఇదో కొత్త జోనర్‌గా నిలబడిపోతోందేమో..?