వరంగల్-ఖమ్మ-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆ స్థానంలో వస్తున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి తీరాలని తీన్మార్ మల్లన్న గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణ రాజకీయ నేతలతో పోలిస్తే ఆయనది భిన్నమైన శైలి. నామినేషన్ వేయగానే తనతో పాటు తన కుటుంబానికి ఉన్న ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసిచ్చేశారు. తీన్మార్ మల్లన్న పబ్లిసిటీ స్టంట్ చేశారని అనుకున్నారు. కానీ ఆయన పత్రాలు రిజిస్టర్ కూడా చేసేశారు.
పనితీరు ఆధారంగా తనపై తానే రీకాల్ సిస్టమ్ కూడా పెట్టుకుంటానని చెబుతున్నారు. కేసీయార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూట్యూబ్ ఛానల్లో చేసిన వీడియోలతో తీన్మార్ మల్లన్న పాపులర్ అయ్యారు. క్యూ న్యూస్ పేరుతో ఉన్న ఆయన చానల్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఓ టీవీ చానల్లో ‘తీన్మార్ మల్లన్న’ కార్యక్రమంతో చింతపండు నవీన్ కుమార్ కు తీన్మార్ మల్లన్న అన్న పేరు స్ధిరపడిపోయింది. దాన్ని ఆయన క్రమబద్దంగా ఉపయోగించుకుంటూ వస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన రాకేష్ రెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ చాన్సిచ్చారు. బీజేపీ పోటీ చేద్దామా వద్దా అని ఆలోచిస్తోంది. ఇద్దరు, ముగ్గురు పేర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నారు కానీ ఇంకా ప్రకటించలేదు. నామినేషన్ల గడువు రెండురోజులు మాత్రమే ఉండటంతో… పోటీ చేస్తుందా లేదా అన్న సందేహం ఉంది. ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న హాట్ ఫేవరేట్ గా మారారు.