ఇన్నాళ్ళు పదునైన విమర్శలతో కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టేసిన ప్రధాని మోడీ మొదటిసారి కాంగ్రెస్ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ప్రతి ఎన్నికల ప్రచార సభలో రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తుండటంతో మోడీ కాంగ్రెస్ ట్రాప్ లో పడ్డారా..? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు ఖాయమని, రాజ్యాంగాన్ని కూడా మార్చేస్తుందని కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తోంది. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా భావించి బీజేపీపై విరుచుకుపడుతోంది. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మొదలు బీజేపీ అగ్రనేతలంతా చెప్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. ప్రతి సభలో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను ప్రధాని పదేపదే ప్రస్తావిస్తు రిజర్వేషన్లపై క్లారిటీ ఇస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.
రిజర్వేషన్లపై ప్రధాని స్పష్టత ఇస్తున్నా.. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గంలో మోడీపై నమ్మకం కుదరడం లేదు. బీజేపీ వస్తే రిజర్వేషన్లు రద్దు అవుతాయనే కాంగ్రెస్ ప్రచారాన్ని మెజార్టీ దళిత , గిరిజన సామాజిక వర్గం విశ్వసిస్తోంది. వీటిని అంచనా వేసే ప్రధాని క్లారిటీ ఇస్తున్నా అది అంతిమంగా కాంగ్రెస్ కు ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చి వదిలేయకుండా తరుచుగా ఈ అంశాన్ని లేవనెత్తుతుండటంతో కాంగ్రెస్ ప్రచారంపై ఎక్కువ చర్చ జరుగుతుందని, తద్వారా ఎస్సీ,ఎస్టీ సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కాంగ్రెస్ ఖాతాలోకి మళ్లే అవకాశం ఉందని అంటున్నారు.