ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది. అధికారం కోల్పోయిన సరే కానీ, పవన్ ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వద్దనే తలంపుతో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం పిఠాపురంలో పరిస్థితి పవన్ కు అనుకూలంగా ఉందని వైసీపీకి నివేదికలు అందటంతో జగన్ ఎన్నికల ప్రచార చివరి రోజు షెడ్యూల్ లో మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది.ఎన్నికల ప్రచార చివరి సభను జగన్ పులివెందులలో నిర్వహిస్తారని వైసీపీ వర్గాలు భావించాయి కానీ, పిఠాపురం సభతో ప్రచారం ముగించాలని పార్టీ నేతలకు ఆదేశాలు అందినట్లుగా సమాచారం. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని నేతలకు జగన్ కబురు పంపినట్లుగా తెలుస్తోంది.
పిఠాపురంలో సినీ ప్రముఖులు మొహరించి పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తుండటంతో జనసేనతో పాటు కూటమిలో కొత్త జోష్ కనిపిస్తోంది. దీంతోపాటు జగన్ ను టార్గెట్ చేసి ప్రచార సభల్లో పవన్ ప్రసంగాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో చివరి సభను నిర్వహించి పిఠాపురంకు వరాల జల్లు కురిపించి పవన్ గెలుపు అవకాశాలను నీరుగార్చాలని జగన్ టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
అయినా…జగన్ రెడ్డి హామీలను పిఠాపురం వాసులు విశ్వసిస్తారా..?అనేది తెలియాల్సి ఉంది. అయితే, పిఠాపురంకు జగన్ హామీలు ఇచ్చినా అదంతా పవన్ పోటీ వల్లేనని ఓటర్లు భావించే అవకాశాలు లేకపోలేదు. ఎలా చూసినా పిఠాపురంలో వైసీపీ ఈసారి నెగ్గడం అసాధ్యం అనే అభిప్రాయాలు మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి.