విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం నాంపల్లి కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.
అక్రమాస్తుల కేసులో నిందితుడుగా ఉన్న జగన్ దేశం విడిచి వెళ్ళవద్దని గతంలో సీబీఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. విదేశాలకు వెళ్ళాలంటే ఆయన తప్పనిసరిగా సీబీఐ కోర్టు అనుమతి తీసుకోవాల్సిందే. అయితే, కొంత కాలంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతోన్న జగన్ పోలింగ్ ముగిసిన అనంతరం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. తన సతీమణి భారతితో కలిసి లండన్ లో తన కూతురును చూసేందుకు వెళ్లనున్నారు జగన్. దీంతో ఆయన కోర్టు పర్మిషన్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకున్నారు.
విదేశాలకు వెళ్లేందుకు జగన్ దరఖాస్తు చేసుకోవడంతో సీబీఐ కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. గతంలో విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా జగన్ విదేశీ పర్యటనకు అనుమతి వచ్చే అవకాశం ఉంది.