కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారీ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇక నుంచి టీకాను ఉత్పత్తి చేయబోమని స్పష్టం చేసింది. కరోనాను ఎదుర్కొనేందుకు సమర్ధవంతమైన టీకాలు అందుబాటులోకి వచ్చినందున ఇక తమ వ్యాక్సిన్ అవసరం లేదని వెల్లడించింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని ప్రపంచ వ్యాప్తంగా పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఇండియాలో కూడా పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిని సర్వోన్నత న్యాయస్థానం విచారణకు కూడా స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్, ప్రాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తుండగా వ్యాక్సిన్ ఉత్పత్తిని ఆస్ట్రాజెనెకా నిలిపివేస్తూ ప్రకటన చేయడం చర్చనీయాంశం అవుతోంది.
తమ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా నిలుపుదల చేస్తున్నామని వెల్లడించింది. అయితే, వాణిజ్యపరమైన కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఐరోపా దేశాలు, ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం తీసుకున్న లైసెన్స్ లను వదులుకుంటున్నట్లు తెలిపింది ఆస్ట్రాజెనెకా.
ఆస్ట్రాజెనెకా తాజా నిర్ణయం కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలు నిజమేనని అంగీకరించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఏకంగా వ్యాక్సిన్ ఉత్పత్తినే నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేయడం ఆందోళనలను రెట్టింపు చేస్తోంది.