తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. నియోజకవర్గ ఇంచార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రచారంలో దూకుడు పెంచేలా ప్లాన్ చేస్తోంది. అయినా కొంతమంది నియోజకవర్గ బాధ్యులు ఈ ఎన్నికలను లైట్ తీసుకున్నారని తెలియడంతో వారిపై హైకమాండ్ పెద్దలు సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చినా పదవులకు ఎసరు తప్పదని వార్నింగ్ ఇచ్చినట్లుగా గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
లోక్ సభ ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై కేసీ వేణుగోపాల్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థులతో ఇటీవల జూమ్ మీటింగ్ నిర్వహించారు. ప్రచారంలో అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని కొంతమందిపై వేణుగోపాల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో వారిలో కదలిక మొదలైనట్లుగా తెలుస్తోంది. ప్రచారానికి మరో రెండు రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఎంపీ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఇంచార్జ్ లుగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిస్తే పదవులు దక్కుతాయి.. ఓడితే మాత్రం మంత్రులపై వేటు పడుతుందని అధిష్టానం వార్నింగ్ ఇవ్వడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంపీ అభ్యర్థులు వారే అయినట్లుగా ప్రచారంలో వేగం పెంచారు.
ఏయే అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది..? ఎక్కడ పార్టీ వెనకబడి ఉంది..? అక్కడ అనుసరించాల్సిన వ్యూహం ఏంటి..? అని అభ్యర్థులతో మంత్రులు, ఎమ్మెల్యేలు సమాలోచనలు జరుపుతున్నారని టాక్. పైగా ఈ నెల 10, 11 న రాహుల్ , ప్రియాంక గాంధీలు రాష్ట్ర పర్యటనకు వస్తోన్న నేపథ్యంలో సభలు, రోడ్ షో లను సక్సెస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అసలే పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో జోష్ మీద ఉండగా.. ఈ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం తేడా వచ్చిన పదవులకు ఎసరు వస్తుందనే హెచ్చరికలతో రెండు రోజుల నుంచి మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రచారాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు.