జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి పదవులు ఇచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎన్నికలు జరుగుతూంటే పత్తా లేకుండా పోయారు. సొంతపార్టీ నేతల్లో వేమిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూంటే విజయసాయిరెడ్డి నేరుగా ఆయనపై పోటీ చేస్తున్నారు. ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఇక తన కొడుకు గెలుపు కోసం పిల్లి సుభాష్ ప్రయత్నిస్తున్నారు. మోపిదేవి పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు ప్రచారంలో పాల్గొన్నట్లుగా ఫోటోలు దిగుతున్నారు. ఏపీలో ఉన్న వారి సంగతి వదిలేస్తే జగన్ బయట వారికి సీట్లిచ్చారు. ఇప్పుడు వారు జగన్ కోసం ఒక్క ఓటు అడిగేందుకు కూడా రావడం లేదు.
తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపారు. ఏపీలో బీసీ నేతలే లేనట్లు తెలంగాణ నుంచి పిలిపించి రాజ్యసభకు పంపారు. అంత వరకూ బాగానే ఉంది. ఆయన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సపోర్టు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే చేశారు. అయినా వైసీపీ ఏమీ చేయలేకపోయింది. ఎప్పుడో ఓ సారి ఏపీకి రావడం జగన్ మోహన్ రెడ్డి గొప్ప సంఘ సంస్కర్త అని వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టును చదవడం .. వెళ్లడం కామన్ గా మారిపోయింది. అయితే ఎన్నికల ప్రచారంలో అది కూడా లేదు.
ఇక పరిమళ్ నత్వానీ అనే రిలయన్స్ పెద్ద మనిషి కనీసం సోషల్ మీడియాలోనూ జగన్ కోసం ఓ ఓటు అడగడం లేదు. ఆయన కనిపిస్తే వైఎస్ ను హత్య చేయించింది రిలయన్సే అని జగన్ ఏడ్చిన దొంగ ఏడుపులు ఎక్కడ బయటకు వస్తాయోనని భయపడుతున్నారేమో కానీ ఆయన వైసీపీ ఎంపీ అనే సంగతిని వైసీపీ నేతలు కూడా గుర్తు చేసుకోవడం లేదు. ఇక నిరంజన్ రెడ్డి అనే మరో సుప్రీంకోర్టు లాయర్ కు రాజ్యసభ సీటిచ్చారు. ఆయన తెలంగాణ నేత. ఆయనకు జగన్ కేసుల్లో వాదనలు వినిపించడానికే సమయం ఉండదు. ఇక ప్రచారానికి ఎలా వస్తారు ?