సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం అని క్యాట్ తీర్పు చెప్పింది. ఆయన జీతభత్యాలు మొత్తం ఇవ్వాలని చెప్పింది. ఓ ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ జీతభత్యాలు మాత్రమే పొందడం కాదు. ఆయన సర్వీసులో ఐదేళ్ల పాటు నష్టపోయారు. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?. ఈ నెలాఖరులో రిటైర్ కావాల్సి ఉంది. ఆయనపై తప్పుడు ఆరోపణలు చేసి సస్పెండ్ చేయకపోతే ఆయన డీజీపీ అయి ఉండేవారు. ప్రభుత్వ కక్ష సాధింపుల వల్ల ఆయన ఆ అవకాశాన్ని కోల్పోయారు. ఈ నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు ?
ఏబీవీ తప్పు చేశారని ఐదేళ్లకాలంలో నిరూపించలేకపోయారు. కానీ ఆయనపై తప్పుడు ఆరోపణలు చేయడానికి మాజీ డీజీపీ ఒకరు ఫోర్జరీ చేశారు.ఈ విషయాన్ని ఏబీవీనే బయట పెట్టారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి అడ్డంగా దొరికిన ఐపీఎస్లు ఎంతో మంది ఉన్నారు. వారిలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత వారెవరూ.. తాను తప్పు చేయలేదని ఏబీవీలా పోరాడే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు చేసిన తప్పులు కళ్ల ముందే సాక్ష్యాలతో ఉన్నాయి. వారిని ఎవరూ కాపాడలేరు అనేది.. తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించిన ఏబీవీ ఉదంతమే నిరూపిస్తోంది.
కౌంటింగ్ వచ్చే నెల నాలుగో తేదీన జరుగుతుంది. ఈ నెల 30వ తేదీనే ఆయన రిటైర్ అవ్వాల్సింది. ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం మారితే… ఆయనను కొనసాగించడానికి కేంద్రానికి ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. కానీ అంతకు ముందే రిటైర్మెంట్ డేట్ రావడం ఇబ్బందికరంగా మారుతుంది. ప్రభుత్వం మారితే ఆయన సర్వీస్ ఖచ్చితంగా కొనసాగుతుంది… అయితే అది నేరుగా సర్వీస్ కొనసాగింపా లేకపోతే.. ప్రత్యేకంగా మళ్లీ ఏదైనా పోస్టు సృష్టించి రిటైర్డ్ అధికారి కేటగిరిలో తీసుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.