పవన్ కల్యాణ్‌పై జగన్ రెడ్డికి ఉన్న కసి రోజు రోజుకీ ఓ రేంజ్లో పెరిగిపోతోంది. పవన్ ప్రస్తావన ఎప్పుడొచ్చినా దత్త పుత్రుడు, నాలుగు పెళ్లిళ్లూ అంటూ ఈ రెండే రెండు ముక్కలు మాట్లాడి బోర్ కొట్టించే జగన్… టీవీ 9 ఇంటర్వ్యూలోనూ అదే చేశారు. ‘మీరు పవన్ కల్యాణ్‌ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కారణం ఏమిటి’ అని అడిగితే – అక్కడ కూడా నాలుగు పెళ్లిళ్లూ, దత్త పుత్రుడూ అంటూ అరిగిపోయిన క్యాసెట్టే వేసి విసిగించేశారు.
రాజకీయాల్లో ఉండేవాళ్లు, క్లీన్ ఇమేజీతో ఉండాలని, మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసుకొంటే యువత వాళ్లనే ఆదర్శంగా తీసుకొని చెడిడిపోతారన్నది జగన్ చెప్పిన మాట. ఈ వివరణకు నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకొన్నా, నాలుగు చేసుకొన్నా, అది పూర్తిగా తన వ్యక్తిగతానికి సంబంధించినది. విడాకులు తీసుకోవడం చాలా క్లిష్టమైన విషయం అని, అది తన చేతుల్లో లేకుండా పోయిందని, ఆ విషయంలో చాలాసార్లు బాధ పడ్డానని పవన్ చాలా సందర్భాల్లో, జన సమక్షంలోనే చెప్పారు. ఆ విషయం జగన్‌కు ఎందుకు గుర్తు లేదు?
పైగా నిజాయతీ గురించి 16 నెలలు చర్లపల్లి జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి మాట్లాడొచ్చా? క్యారెక్టర్ గురించి లక్షల కోట్లు ప్రజాధనాన్ని మింగిన నేత మాట్లాడొచ్చా? కుటుంబాల గురించి అమ్మనీ, తోబుట్టువుని బయటకు గెంటేసిన వ్యక్తి చెప్పొచ్చా? ఇదెంత హాస్యాస్పదం? తను సినిమాల ద్వారా కష్టపడిన సొమ్ముని రైతుల కోసం ధారాదత్తం చేస్తున్నప్పుడు ‘మూడు పెళ్లిళ్లు’ అడ్డు రాలేదు. తుపాను బాధితుల కోసం కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చినప్పుడూ ‘విడాకులు’ పెద్ద సమస్య కాలేదు. ప్రజలకు ఏం అవసరం వచ్చినా, వాలిపోయే మనసత్తత్వానికి పవన్ వ్యక్తిగత జీవితం స్పీడు బ్రేకర్లు వేయలేదు. అలాంటప్పుడు వాటిని బూచిగా చూపించి, పవన్‌కు ఓట్లెయ్యొద్దు అని చెప్పే హక్కు జగన్‌కు ఎక్కడ ఉంది? ఇంకా… ఇంకా మూడు పెళ్లిళ్ల గురించే మాట్లాడితే జగన్ మరింత దిగజారిపోతాడే తప్ప, ఈ విషయంలో పవన్‌కు వచ్చిన డామేజీ ఏం లేదు. ఇది జగన్ గుర్తుంచుకొంటే మంచిది.