రాజకీయ ప్రచారం వ్యూహాత్మకంగా ఉండాలి. ప్రజల్లో మూమెంట్ తెచ్చేది ప్రచారమే. ప్రచారంలో ముందున్నారు అన్న అభిప్రాయం కలిగితే ప్రజల మూడ్ ఆటోమేటిక్ గా మారిపోతుంది. కానీ వైసీపీ ఈ ప్రచారం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. కూలి మీడియాలో వచ్చే పిట్టకథలపైనే ఆధారపడుతోంది. ఆ టీవీ చానళ్లను చూసే వారు ఇప్పుడు తగ్గిపోయారు. ఓటీటీలు వచ్చాక న్యూస్ చానళ్లు చూడటం తగ్గిపోయిదని రేటింగ్ లే చెబుతున్నాయి అయినా వైసీపీని తన స్ట్రాటజీని మార్చుకోలేకపోతోంది.
ఎటు వైపు చూసినా కూటమి నేతల సభలు.. సమావేశాలే కనిపిస్తున్నాయి. వైసీపీ తరపున రెండు రోజులకోసారి జగన్ సెలవు తీసుకుని ప్రచారం చేస్తున్నారు. రోజుకు మూడుసభల్లో ప్రసంగిస్తున్నారు. అది తప్ప వేరే యాక్టివిటీ లేదు. మరో స్టార్ క్యాంపెయినర్ లేరు. వైసీపీ కోసం ప్రచారం చేయడానికి ఎవరూ రావడం లేదు. ఇంత ఘోరమైన దుస్థితిని జగన్ గతంలో ఎదుర్కోలేదు. అధికారంలో ఉండి అందర్నీ దూరం చేసుకున్న ప్రతిఫలం ఇప్పుడు జగన్ కు కనిపిస్తోంది. ఎన్నికలు వస్తాయని తెలుసు.. ప్రజల్లోకి వెళ్లాలని తెలుసు. అయినా నిర్లక్ష్యంతో అసలు ప్రచారాన్ని ప్లాన్ చేసుకోలేకపోయారు.
క్షేత్ర స్థాయిలో వైసీపీ అసలు కనిపించడం లేదు. గత ఐదేళ్లుగా క్యాడర్ తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రయోజనం ఏమీ లేదని వారు కదలడం లేదు. అందుకే అందరికీ డబ్బులు పంచారు. డబ్బులు తీసుకున్నారు కానీ చాలా మంది యాక్టివ్ గా ఉండటం లేదు. ఈ పరిస్థితి వైసీపీని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.