ఎన్నికల ప్రచారంలో తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. కాంగ్రెస్ ను ఇరకాటంలోకి నెట్టబోయి సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.
పొద్దున్న లేస్తే అంబానీ, అదాని అని మాట్లాడే కాంగ్రెస్ నేతలు ఎన్నికలు మొదలయ్యాక వారి గురించి ఎందుకు మాట్లాడటం మానేశారని ప్రశ్నించారు మోడీ. అదాని, అంబానీ నుంచి ఎంత మొత్తంలో నిధులు ఇచ్చారని కాంగ్రెస్ ను నిలదీశారు. మోడీ చేసిన ఈ వ్యాఖ్యలే రాజకీయ దుమారం రేపుతున్నాయి.
మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. మోడీ మిత్రులు అదాని, అంబానీల గురించి తలుపులు మూసి మాత్రమే మాట్లాడుతారని మొదటిసారి బహిరంగంగా ఆయన మాట్లాడుతున్నారని ప్రియాంక గాంధీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యాఖ్యలను చూస్తుంటే ఓటమి భయం స్పష్టం అవుతుందన్నారు. మరోవైపు ఏఐసీసీ అద్యక్షుడు ఖర్గే కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మోడీకి ఎంత గడ్డు కాలం వచ్చింది. ఆఖరికి తనకు అండగా నిలిచిన మిత్రులపైన కూడా మాటల దాడి చేసే స్థితికి చేరుకున్నారని ట్వీట్ చేశారు.
నిజంగానే.. అదాని, అంబానీలు కాంగ్రెస్ కు ఎన్నికల ఫండింగ్ చేశారా..? వారి వద్ద అంత పెద్దమొత్తంలో బ్లాక్ మనీ ఉంటే ఈడీ, సీబీఐలను ఎందుకు రంగంలోకి దిగడం లేదన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ ప్రత్యర్ధుల విషయంలో దూకుడుగా వ్యవహరించే ఈడీ, సీబీఐలు ప్రధాని బహిరంగంగా అదాని, అంబానీల వద్ద నల్లదనం ఉందని చెప్పకనే చెప్తున్నా ఎందుకు మిన్నకుండిపోయాయని విమర్శలు వస్తున్నాయి.