Pratinidhi 2 movie review
తెలుగు360 రేటింగ్ 2.25/5
నారా రోహిత్ కెరీర్ లో చెప్పుకొదగ్గ సినిమాల్లో ‘ప్రతినిధి’ ఒకటి. వ్యవస్థని ప్రశ్నించే సామాన్యుడి కథగా వచ్చిన ఈ సినిమా మంచి ప్రసంశలు అందుకుంది. ఇప్పుడు కొంత విరామం తర్వాత మళ్ళీ కెమెరా ముందుకు వచ్చిన రోహిత్ ఈ ఫ్రాంచైజ్ లో రెండో సినిమాగా ‘ప్రతినిధి 2’ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రముఖ టీవీ ఛానల్ జర్నలిస్ట్ గా పని చేస్తున్న మూర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ కథలో రాజకీయంశాలు వుండటం, హీరో, దర్శకుడి నేపధ్యాలు కూడా రాజకీయాలతో ముడిపడ్డంతో ఇదొక ప్రాపగాండ సినిమాని ప్రచారం జరిగింది. అయితే చిత్ర యూనిట్ మాత్రం ఈ సినిమాకి రాజకీయాలతో సంబంధం లేదని, ఏ పార్టీని ఉద్దేశించింది కాదని, ఇదొక పొలిటికల్ థ్రిల్లరని చెప్పుకొచ్చింది. మరి ప్రతినిధి 2 లో ఏం వుంది? ఇది నిజంగా ప్రాపగాండ చిత్రమా? లేదా ఫిక్షనల్ పొలిటికల్ థ్రిల్లరా? ఇందులో చూపించిన అంశాలు ప్రేక్షకులని ఎంతమేరకు ఆకట్టుకున్నాయి?
ప్రజా శ్రేయస్సు పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి (సచిన్ ఖేడ్కర్). ప్రజలకు పలు సంక్షేమ పధకాలని అందించి రెండో దఫా ముఖ్యమంత్రిగా కొనసాగుతుంటారు. ఓ రాత్రి క్యాంప్ ఆఫీస్ లో పని చేస్తుండగా ఎవరో దుండగులు చేసిన బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోతాడు ప్రజాపతి. ఆయన మరణం తర్వాత ఆయన కొడుకు విశ్వం (దినేష్ తేజ్) తదుపరి ముఖ్యమంత్రి కావాలని పార్టీ సభ్యులు కోరుకుంటారు. మరి విశ్వం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడా? అసలు ముఖ్యమంత్రిని చంపాల్సిన అవసరం ఎవరికి వుంది? ఆయనకి వున్న శత్రువులు ఎవరు? ఈ కేసులో ఎన్సీసీ న్యూస్ ఛానల్ సిఈవో చేతన్ (నారా రోహిత్) పాత్ర ఏమిటి? కేసుని విచారించిన సిబీఐకి ఎలాంటి నిజాలు తెలిశాయి? అనేది తక్కిన కథ.
నిజం చెప్పడం కోసం ప్రాణాలని సైతం తెగించే ఓ నిజాయితీ గల జర్నలిస్ట్ కథ ఇది. నిజ జీవితంలోని సామజిక, రాజకీయ అంశాలకు ఫిక్షన్ ని జోడించి ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ కథని రాసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాంబ్ బ్లాస్ట్ సన్నివేశంతో కథ ప్రారంభమౌతోంది. తర్వాత హీరో చేతన్ పాత్రని నిజాయితీ గల ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పరిచయం చేసే సన్నివేశాలు, మార్కెట్ లో జరిగే ఫైట్, తర్వాత ఉదయభాను కోరిక మేరకు హీరో ఛానల్ లో పని చేయడానికి ఒప్పుకోవడం.. ఈ సన్నివేశాలన్నీ చకచక ముందుకు సాగుతాయి. మంత్రి గజేంద్ర (అజయ్ ఘోష్) ని చేతన్ ప్రశ్నించే ఎపిసోడ్ ఓ టీవీ ఇంటర్వ్యూలా ఉన్నప్పటికీ అక్కడ రాసుకున్న డైలాగులు ఆసక్తికరంగానే వుంటాయి. తర్వాత వచ్చే ఉప ఎన్నికల ఎపిసోడ్, నరసింహ పాత్రలో పృద్వీ చేసే హంగామా, న్యూస్ టెలీకాస్ట్ స్టే చుట్టూ నడిపిన సన్నివేశాలు సోషల్ కామెంటరీలా సాగుతాయి. ఓటు హక్కు విలువ గురించి చెప్పే మాటలు ఆలోజింపచేసేలా వుంటాయి. అయితే ఇంటర్వెల్ దగ్గరపడుతున్నప్పటికీ ఇందులో కథ, కాన్ ఫ్లిక్ట్ అంతగా రక్తికట్టదు. కాకపోతే ఇంటర్వెల్ ట్విస్ట్ రెండో సగంపై బాగానే ఆసక్తిని పెంచగలిగింది.
అప్పటివరకూ సోషల్ కామెంటరీలా సాగుతున్న సన్నివేశాలు రెండో సగంలో ఇన్వెస్టి గేషన్ జోనర్ లోకి షిఫ్ట్ అవుతాయి. హూ కిల్డ్ సీఎం? అనే ప్రశ్న చుట్టూ జరిగిన సిబీఐ విచారణ అంత ఆసక్తిగా అనిపించలేదు. సీన్స్ అన్నీ అక్కడక్కడ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. తొలిసగంలో ఎంతో కొంత డ్రామా రన్ అయ్యింది. సెకండ్ హాఫ్ లో మాత్రం కథ ఎంతకీ ముందుకు కదలదు. హీరో కి ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అనుకున్నారు కానీ అది పెద్దగా కలిసిరాలేదు. పైగా రొటీన్ గా వుంది. చాలా సన్నివేశాలు న్యూస్ బులిటెన్ లా సాగడం అంతగా రుచించదు. ఇంటర్వెల్ లో వూహించని మలుపు వుంది. సెకండ్ హాఫ్ లో కూడా లాంటి ఓ మలుపు వుంటే బావుండేది. కానీ ప్రేక్షకుడు ట్రైలర్ చూసి ఊహించిన ట్విస్ట్ క్లైమాక్స్ లో రివిల్ అవ్వడం అంత ఉత్సాహంగా అనిపించదు.
నారా రోహిత్ కి కమ్ బ్యాక్ సినిమా ఇది. తన యాక్షన్ డైలాగ్ డిక్షన్ మునపటిలానే వుంది. యాక్షన్ సీక్వెన్స్ లు కూడా బాగా చేశారు. క్లైమాక్స్ ఫైట్, పొగ ఎఫెక్ట్ లో వచ్చే యాక్షన్ సీన్స్ బావుంటాయి. అయితే ఆయన లుక్ కొంచెం బొద్దుగా వుంది. ఈ పాత్రకు ఓకే కానీ మున్ముందు రాబోయే సినిమాలకి మాత్రం తన ఫిజిక్ పై ద్రుష్టి పెట్టాలి. సిరి పద్దతిగా కనిపించింది. సచిన్ ఖేడ్కర్ స్క్రీన్ ప్రజెన్స్ హుందాగా వుంది. అజయ్ ఘోష్, పృద్వీ పాత్రలు పర్వాలేదనిపిస్తాయి. ఇంద్రజ ఒక్క సీన్ లో కనిపించినప్పటికీ అది కీలకమైనదే. జీషు సేన్ గుప్తా కాస్త లౌడ్ యాక్టింగ్ చేసినట్లుగా అనిపించింది. అజయ్ రాజకీయ వ్యూహకర్తగా కనిపించారు. దినేష్ తేజ్, తనికెళ్ళ భరణి, ఉదయభాను తో పాటు మిగతా పాత్రలు పరిధి మేరకు కనిపించారు.
మహతి సాగర్ నేపధ్యం సంగీతం చాలా చోట్ల కావాల్సిన దానికంటే ఎక్కువ పవర్ ప్యాక్డ్ గా చేసినట్లుగా అనిపించింది. కొన్ని సీన్స్ ని ఆయన రీరికార్డింగ్ డామినేట్ చేసింది. కెమరా పనితనం బావుంది. ఎడిటింగ్ పదునుగానే వుంది కానీ సెకండ్ హాఫ్ లో ఆ విచారణ జరిగిన తీరుని ఇంకాస్త షార్ప్ చేయాల్సింది. ముందుగా చర్చలోకి వచ్చినట్లుగా ఇది పొలిటికల్ ప్రాపగాండ సినిమా అయితే కాదు. కొన్ని సంఘటనలకు తన ఊహ జోడించి ఓ పొలిటికల్ సస్పెన్ థ్రిల్లర్ ని చేయాలనుకున్నాడు దర్శకుడు. ఆ ఊహ వరకూ బాగానే వుంది కానీ ఆసక్తికరమైన కథా, కథనాలే కుదరలేదు.
తెలుగు360 రేటింగ్ 2.25/5