నర్సరావుపేట కోడెల హయాంలో వైసీపీ కంచుకోట. కానీ నియోజకవర్గాల పునర్విభజన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండటంతో .. కోడెల సొంత మండలాన్ని సత్తెనపల్లి నియోజకవర్గంలో చేర్చేశారు. అదనంగా రెడ్డి సామాజికవర్గం ఉండే మండలాన్ని నర్సరావుపేటలో చేర్చారు. అప్పటి నుంచి వైసీపీ కంచుకోటగా మారింది. కోడెల సత్తెనపల్లికి మారాల్సి వచ్చింది. ఇప్పుడు టీడీపీకి బీసీ నేత అరవిందబాబు నేతృత్వం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన ఆయన ఇప్పుడు మరోసారి బరిలోకి దిగారు. ఐదేళ్లు దాడులకు వెరువని ఆయన పోరాటంపై ప్రజల్లో సానుభూతి కనిపిస్తోంది.
నర్సరావుపేటలో రెడ్డి, కమ్మ, బీసీ, ముస్లిం, ఆర్యవైశ్య ఓటర్లు ఎక్కువుగా ఉంటారు. అభ్యర్థుల గెలుపోటముల్లో రైతులు, రైతుకూలీలు, వ్యాపారవర్గాలు, ఉద్యోగులదే ప్రధాన పాత్ర. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి 55 శాతం ఓట్లు సాధించి ఘన విజయం అందుకున్నారు. అదే సమయంలో టీడీపీ నుంచి పోటీ చేసిన చదలవాడ అరవింద్ బాబుకు 38 శాతం ఓట్లు వచ్చాయి. జనసేన అభ్యర్థి 5 శాతం ఓట్లు రాబట్టారు. ఇతరులకు 2 శాతం ఓట్లు లభించాయి. 2014లో బీజేపీకి కేటాయించారు. ఈ సారి బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీ కోసం పని చేస్తున్నాయి.
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సొంతక్యాడర్ లోనే అసమ్మతి ఉంది. జగన్ మోహన్ రెడ్డి అందర్నీ బుజ్జగించి గోపిరెడ్డికే టిక్కెట్ ఖరారు చేశారు. కానీ వారెవరూ సంతృప్తిగా పని చేయడం లేదు. కాసు మహేష్ రెడ్డికి నర్సరావుపేటపైనే ఎక్కువ గురి. గోపిరెడ్డి ఒక్క సారి ఓడిపోతే తాను ఆ సీటులో కర్చీఫ్ వేయవచ్చని.. ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ప్రచారం ఉంది. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా గోపిరెడ్డి నర్సరావుపేటకు చేసిందేమీ లేకపోవడం ఆయనకు సమస్యగా మారింది. కార్యకర్తలను పట్టించుకోకపోవడం .. మట్టి, ఇసుక ద్వారా కూడా తానే ఆదాయం పొందడంతో ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తిలో ఉన్నారు. కొంత మంది నేతలు టీడీపీలో చేరిపోయారు.
నర్సరావుపేట నియోజకవర్గంలో రొంపిచర్ల మండలంతో పాటు నర్సరావుపేట పట్టణం ఉన్నాయి. రొంపిచర్ల మండలంలో రెడ్డి సామాజికవర్గం అధికం కావడంతో వైసీపీకి ఎప్పుడూ మెజార్టీ వస్తోంది. విజేతను నిర్ణయించేది నర్సరావుపేట పట్టణమే. పట్టణంలో టీడీపీకి మొదటి నుంచి ఆధిక్యత వస్తుంది. ఈ సారి ప్రభుత్వం, ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తితో పాటు టీడీపీ మేనిఫెస్టోను విస్తృతంగా ప్రచారం చేయడం టీడీపీకి కలసి వస్తోంది. చదలవాడ అరవింద్ బాబుకు నర్సరావుపేటలో ఈ సారి క్యాడర్ మద్దతు బలంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓడిన తర్వాత అరవింద్ బాబు ఏమాత్రం నిరాశ చెందకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే వచ్చారు. అలా పార్టీని, క్యాడర్ ను పట్టు జారకుండా చూసుకున్నారు. పార్టీ కార్యకర్తలకు ఆర్థికంగా అండగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా నియోజకవర్గంలో కనిపిస్తోంది. అదే సమయంలో ప్రస్తుత ప్రభుత్వం, ప్రస్తుత ఎమ్మెల్యేపై వ్యతిరేకత కనిపిస్తుండడం కూడా టీడీపీ గెలుపు అవకాశాలను పెంచుతున్నాయని అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలే అవకాశం లేకపోవడంమరో ప్లస్ పాయింట్.