ఇసుక అక్రమ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేతలకు ఎంత బిజినెస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేతలంతా సిండికేట్ అయి ఇసుకను బంగారంలా ధరలు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్లగొట్టిన ఆరోపణలు అనేకం.
కోర్టులు స్వయంగా జోక్యం చేసుకొని… అక్రమ మైనింగ్ పై ఉక్కుపాదం మోపాలన్న ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదు. ఇదే అంశంపై సుప్రీం కోర్టు మరోసారి సీరియస్ అయ్యింది. అక్రమ మైనింగ్ ఆపాల్సిందేనని స్పష్టం చేసింది.
వెంటనే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు కేంద్ర పర్యావరణ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి, అక్రమ మైనింగ్ జరుగుతుందో లేదో నిర్ధారించాలని ఆదేశించింది. ఇప్పటికే అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకున్నామన్న ఏపీ వాదనను తోసిపుచ్చిన కోర్టు, మీ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితం అయ్యాయి అని వ్యాఖ్యానించింది.
అక్రమ మైనింగ్ ఆపటం, యంత్రాలను ఊపయోగించకుండా అనుమతి ఉన్న ప్రాంతాల్లో ఇసుక తీసుకోవాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయినా, యంత్రాలతో ఇసుక మైనింగ్ చేస్తున్నారని, అక్రమ మైనింగ్ కూడా జరుగుతుందని ఆధారాలను ఎన్జీవో నేత కోర్టు ముందుంచారు.