Krishnamma Movie Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
కొన్ని కథల్ని మలయాళ, తమిళ దర్శకుడు డీల్ చేసే విధానం భలే బాగుంటుంది. వాస్తవికతకు అద్దం పట్టేలా సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఆయా కథల్లో జీవం ఉట్టిపడుతుంటుంది. సినిమాటిక్ గ్లామర్‌ని అస్సలు పట్టించుకోరు. ప్రతీ సీన్ రంగుల హరివిల్లులా ఉండాలనే లెక్కలు వేసుకోరు. అనుకొన్నది అనుకొన్నట్టు ‘రా’గా తీసేస్తారు. అందుకే ఆ సినిమాలు మనసుల్లో నాటకుపోతుంటాయి. ఈమధ్య మన దర్శకులు కూడా వాస్తవికతకు పెద్ద పీట వేస్తున్నారు. తెలుగు సినిమా గ్లామర్‌ని మార్చడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘కృష్ణమ్మ’ చూస్తే మన దర్శకులపై తమిళ, మలయాళ దర్శకుల ప్రభావం కాస్త గట్టిగానే పడుతోందన్న ఫీలింగ్ వస్తుంది. మరింతకీ ఈ ‘కృష్ణమ్మ’ ఎలా ఉంది? ఈ కథలోని అలలు, ఆటుపోట్ల సంగతేంటి??
భద్ర (సత్యదేవ్) ఓ అనాథ. తనకు కోటి, శివ అనే ఇద్దరు స్నేహితులు. వాళ్లకూ ఎనకా ముందు ఎవరూ లేరు. ముగ్గురిదీ ఒకే కథ, ఒకే వ్యథ. భద్ర, కోటి ఇద్దరూ విజయవాడలో గంజాయి సప్లయ్ చేస్తుంటారు. వీళ్ల జీవితంలోకి మీనా ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది. మీనా, శివ ఇద్దరూ ప్రేమించుకొంటారు. మీనా రాకతో ఈ స్నేహితులకు ‘మనకంటూ ఓ కుటుంబం ఉంద’న్న భావన కలుగుతుంది. అయితే అనుకోకుండా ఈ ముగ్గురూ చేయని నేరానికి జైలు కెళ్తారు. అక్కడ్నుంచి వీళ్ల జీవితాలన్నీ చిన్నాభిన్నం అవుతాయి. ఇంతకీ… ఈ ముగ్గురూ ఎందుకు అరెస్ట్ అయ్యారు? వాళ్లపై మోపిన నేరమేమిటి? అందులోంచి బయటపడ్డారా, లేదా? అనేది మిగిలిన కథ.
ఎవరో చేసిన నేరాన్ని అమాయకులపై నెట్టడం, ఆ కేసులో ఇరుక్కొని జీవితాన్ని పాడు చేసుకోవడం ‘విచారణై’లాంటి కథల్లో చూశాం. ఇది కూడా అలాంటి కథే. కాకపోతే.. దానికి స్నేహం అనే ఎమోషన్ని అద్దాడు దర్శకుడు. తొలి సన్నివేశంతోనే ‘ఏదో జరుగుతోంది’ అనే మూడ్ క్రియేట్ చేశారు. విజయవాడలోని ఇంచిపేటలోని వాతావరణాన్ని తెరపై బాగా తీసుకురాగలిగారు. ఎక్కడా సెట్ల గోల లేదు. ఆర్టిఫిషియల్ రంగులు లేవు. సత్యదేవ్ తో పాటు మిగిలిన పాత్రలు విజయవాడ యాసని బాగా పట్టుకొన్నారు. ముఖ్యంగా సత్యదేవ్ అయితే విజయవాడలో పుట్టి పెరిగిన అబ్బాయిలానే కనిపిస్తాడు. ముగ్గురు స్నేహితుల కథ, వాళ్ల గొడవలు, అలకలూ, ప్రేమకథలూ చూపించడానికి దర్శకుడు కొంత సమయం తీసుకొన్నాడు. ఓరకంగా చెప్పాలంటే విశ్రాంతి వరకూ కూడా అసలు కథలోకి వెళ్లలేదు. ఇంట్రవెల్ కార్డ్ దగ్గర అసలు దర్శకుడు ఏం చెప్పదలచుకొన్నాడు? ఈ కథ ఎంత వరకూ అయ్యింది? అనే ప్రశ్న ప్రేక్షకుడ్ని వేధిస్తుంది.
సెకండాఫ్‌లో చేయని నేరానికి శిక్ష అనుభవించడం అనే కాన్సెప్ట్ మొదలవుతుంది. అసలు ఓ కేసులోకి అమాయకుల్ని ఇరించడానికి పోలీసులు చేసే ప్రయత్నాలు భయపెట్టిస్తే, అవసరార్థం తప్పు నెత్తిమీద వేసుకొన్న ముగ్గురు స్నేహితుల అమాయకత్వం కలవరింతకు గురి చేస్తాయి. అసలు ఎలాంటి కేసులో ప్రధాన పాత్రలు ఇరుక్కొన్నారు? అనే ప్రశ్నకు చాలా సేపటి వరకూ సమాధానం ఇవ్వలేదు. దాంతో ఎందుకు ఈ సన్నివేశాన్ని సాగదీస్తున్నారు? అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఒక్కసారిగా ఆ కేసు పూర్వాపరాలు రివీల్ చేశాక, గుండె తరుక్కుమంటుంది. బహుశా ఈ పాయింట్ దగ్గరే లాక్ అయి, ఈ సినిమాని అంతా ‘ఓకే’ చేసి ఉంటారు. ఎమోషన్ తో ముడిపడిన పాయింట్ అది. ఈ సినిమాను ‘విచారణై’తో ముడి పెట్టనివ్వకుండా దూరం చేసింది. అయితే హీరో రివైంజ్ తీర్చుకొనే విధానం చాలా సాదాసీదాగా అనిపిస్తుంది. ఆయా సన్నివేశాల్ని చుట్టేసిన ఫీలింగ్ కలిగిస్తాయి. పన్నెండేళ్ల పగని సింపుల్ గా పన్నెండు నిమిషాల్లో ముగించారు. ఆ రివైంజ్ డ్రామాని కొత్తగా ఆవిష్కరిస్తే, ఒళ్లు జలదరించేలా సన్నివేశాల్ని రాసుకోగలిగితే.. ‘కృష్ణమ్మ’ అనుకొన్న తీరానికి చేరుకొనేదేమో…? తొలి సగంలో సాగదీత ప్రేక్షకుల్ని కొంత విసిగిస్తుంది. కొన్ని విషయాలు ప్రేక్షకుల్ని మిస్ లీడ్ చేసేలా ఉన్నాయి. తొలి సన్నివేశం అందులో భాగమే. క్లైమాక్స్ గుర్తుండిపోయేలా తీసి ఉంటే – బాగుండేది.
సత్యదేవ్ సహజ నటుడు. పాత్రకు ఏం కావాలో అదే చేస్తాడు. భద్ర విషయంలోనూ అదే జరిగింది. ఈ పాత్రకు తను పర్ఫెక్ట్ గా సరిపోయాడు. ముఖ్యంగా విజయవాడ యాసని ఆకళింపు చేసుకొన్న పద్ధతి నచ్చుతుంది. లక్ష్మణ్‌కు మరోసారి మంచి పాత్ర పడింది. క్లైమాక్స్‌లో ‘ఏరా చచ్చాడా..’ అంటూ శత్రువు చావు కబురు విన్న తరవాత… ఆ కళ్లల్లో చూపించిన ఆనందం నటుడిగా తనేంటో చెబుతుంది. అర్చనా అయ్యర్‌ది ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర. అసలు సత్యదేవ్‌తో ట్రాక్ ఏమాత్రం పొసగలేదు. బలవంతంగా ఇరికించినట్టే అనిపిస్తుంది. ఈ ట్రాక్‌కి ఓ ప్రారంభం, ముగింపు అంటూ లేకుండా పోయాయి. అథిరా రాజ్ చాలా సహజంగా కనిపించింది. ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంది కూడా. పోలీస్ పాత్రలో నంద గోపాల్ భయపెట్టాడు.
టెక్నికల్‌గా ఈ సినిమా బాగానే సౌండ్ చేసింది. కాలభైరవ పాటలు గుర్తు పెట్టుకొనేలా లేవు. కానీ నేపథ్య సంగీతంతో ఓ మూడ్ క్రియేట్ చేశాడు. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. కృష్ణానదీ తీరాన్ని అందంగా చూపించారు. ఈ కథలో కృష్ణమ్మ కూడా ఓ భాగమన్నట్టు చిత్రీకరించారు. మాటలు కొన్ని బాగానే పేలాయి. అయితే ఇంకాస్త ఇంపాక్ట్ చూపించాల్సింది. కొరటాల శివ ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించారు. కథలో సెన్సిబులిటీస్ ఆయన్ని కదిలించి ఉంటాయి. ఓవరాల్ గా కృష్ణమ్మ.. ఓ రివైంజ్ డ్రామా. అక్కడక్కడ నెమ్మదిగా సాగి, ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అయితే.. ద్వితీయార్థంలోని ఎమోషన్, డ్రామా ప్రేక్షకుల్ని కదిలిస్తుంది. అయితే కమర్షియల్ గా ఎంతవరకూ వర్కవుట్ అవుతుందన్నది చెప్పలేం.
తెలుగు360 రేటింగ్: 2.75/5