ఎంపీ ఎన్నికలను తెలంగాణలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.మెజార్టీ సీట్లే లక్ష్యంగా నెల రోజులుగా తీరిక లేకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించాయి. ప్రత్యర్ధి పార్టీలపై అనేక ఆరోపణలు, విమర్శలతో ఎండలను మించి పాలిటిక్స్ ను వేడెక్కించగా మే 13న ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు.
అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధానంగా రిజర్వేషన్ల అంశాన్ని ప్రచారాస్త్రంగా బీజేపీని టార్గెట్ చేసింది.బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని.. వందేళ్ల ఆర్ఎస్ఎస్ ఎజెండా కూడా ఇదేనని ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా చెప్తూ వచ్చారు. రైతు రుణమాఫీని పంద్రాగస్ట్ లోపు పూర్తి చేస్తామనే హామీని రేవంత్ తరుచుగా లేవనెత్తడం కనిపించింది.
బీజేపీ మాత్రం కాంగ్రెస్ ను డిఫెండ్ చేయడానికే ఎకువ ప్రాధాన్యత ఇచ్చింది. అభివృద్ధి అంశాన్ని ప్రస్తావించకుండా బీజేపీతో రిజర్వేషన్లకు ఎలాంటి డోకా ఉండదని, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మోడీతో సహా రాష్ట్ర నేతలు కూడా ఈ అంశాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే, మోడీతోనే దేశానికి సమర్ధవంతమైన పాలన అందుతుందని రాష్ట్ర నేతలు వ్యాఖ్యానించడం కనిపించింది.
బీఆర్ఎస్ మాత్రం రైతు సమస్యలపైనే ఎక్కువగా ఫోకస్ చేసింది. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు అంటూ అధికార పార్టీపై విమర్శలు చేసింది. ఈసారి కేంద్రంలో ఏ పార్టీకి మెజార్టీ రాదని.. బీఆర్ఎస్ కు 10 – 12సీట్లు వస్తే కేంద్రంలో బీఆర్ఎస్సే కింగ్ మేకర్ అవుతుందన్నారు. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదుల్లో ప్రధానంగా చర్చకు నిలిచాయి.
తెలంగాణ ప్రజలు ఎవరి ప్రచారాన్ని విశ్వసించారో తేలేందుకు, ఏ పార్టీ ప్రచారం జనాలను ఎక్కువగా ఆలోచింపజేసిందో తెలుసుకునేందుకు మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.