” ఓ చిన్న దొంగను చూస్తే దొంగ దొంగ అని అరిచి పట్టుకుని చెట్టుకు కట్టేసి కొడతాం. కానీ అదేపెద్ద దొంగ వందలు, వేల కోట్లు దోచిన వాడు కనిపిస్తే.. ఎక్కడా లేనంత గౌరవం ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితి చూస్తేనే భయమేస్తూ ఉంటుందని ” దర్శకుడు రాజమౌళి ఓ సందర్భంలో కాలేజీ విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు. ఇది వంద శాతం నిజం. బడా దోపిడీగాళ్లు అంతా రాజకీయాల్లోనే ఉన్నారు. చిన్న కేసు ఉంటే ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వరే.. మరి ఎందుకు ప్రభుత్వాలనే చేతుల్లో పెట్టేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది ?
దారుణమైన హత్య కేసుల్లో జైల్లో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేసి.. విజయం సాధించిన సందర్భాలు చూస్తున్నాం. సీబీఐ ఢిల్లీ సీఎంను అరెస్టు చేయగలిగింది కానీ ఓ సాధారణ ఎంపీని అరెస్టు చేయలేకపోయింది. అంటే ఆ ఎంపీ ఎంత పవర్ ఫుల్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పవర్ ఎలా వచ్చింది ? . బెయిల్ పై బయటకు వచ్చి కేసుల విచారణలు జరగకుండా చేయడమే కాదు.. అన్ని వ్యవస్థలపై దాడి చేసే వారు పాలకులు అవుతున్నారు. క్రిమినల్ పాలకులు.. తమ బురద అందరికీ పూయాలని వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలు కేసులు పెట్టుకుంటూ పోతున్నారు. చట్టం, న్యాయం అనేద లేకుండా చిన్న సాక్ష్యం లేకపోయినా జైళ్లలో పెట్టి అడ్డగోలు ఆరోపణలు చేయడం కామన్ అయిపోయింది.
క్రిమినల్స్ ను ఎందుకు జైల్లో పెడతారు ? వారు బయట ఉంటే అలాంటి క్రిమినల్ పనులు చేస్తారని..జైల్లో మారు మనసు పొందుతారని. కానీ రాజకీయ బలం ఉన్న వారిని బయటే ఉంచి.. వారి చేతికి వ్యవస్థలు వెళ్లేలా చేయడం వల్ల.. మొత్తం సమాజం నష్టపోతోంది.. శిక్షకు గురవుతోంది. ఈ పరిణామాలు ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్‌లోనూ తీవ్రంగా ఉంటాయి. వ్యవస్థలు కాపాడాలి..కాపాడతాయి అని ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు. ముందు ఓటర్లు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. క్రిమినల్స్ ని ఎన్నుకుని వాళ్ల నుంచి రక్షణ కావాలని వ్యవస్థల దగ్గరకు వెళ్తే… ఆ వ్యవస్థలను కూడా ప్రజలు అధికారం ఇచ్చిన క్రిమినల్స్ గుప్పిట పట్టుకుంటారని గుర్తుంచుకోవాలి.
అందుకే ఓటు అనేది ఓ పథకానికి లేదా ఓ నోటు కోసం ఇచ్చేసే విలువలేని హక్కు కాదు. అది తలరాతను మార్చేది. చూసి వాడుకోవాలి. ప్రలోభాలకు వాడితే… ఓ ఓటే పామైకరుస్తుంది. అందుకే ఓటు వేసే ముందు.. సరైన పాలకుడెవరో విశ్లేషించుకోండి. ఆ తర్వాతే ఓటేయండి.