డూ ఆర్ డై అన్నట్లుగా జరుగుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి వచ్చే సరికి కొన్ని విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి మెగా ఫ్యామిలీ అంతా తరలి వచ్చి మద్దతు తెలిపింది. శనివారం రామ్ చరణ్ తోపాటు ఆయన తల్లి పిఠాపురం వెళ్లనున్నారు. పవన్ కోసం ప్రచారం చేస్తారు.
అయితే అల్లు అర్జున్ మాత్రం తన భార్యతో కలిసి నంద్యాల వెళ్తున్నారు. నంద్యాల నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆతిధ్యం స్వీకరించనున్నారు. అల్లు అర్జున్ నేరుగా ప్రచారం చేయరు కానీ.. తన మద్దతు ఆయనకేనని చెప్పడానికి వెళ్తున్నట్లుగా సులువుగానే అర్థమవుతుంది. ఇక్కడ అర్జున్ పార్టీ ప్రస్తావన తీసుకొచ్చే చాన్స్ లేదు. శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ దంపతులు ఇద్దరికీ స్నేహితుడు. అందుకే ఆయనకు ఎన్నికల్లో సంఘిభావం చెప్పడానికి వెళ్తున్నారు.
నిజానికి అర్జున్ తన వ్యక్తిగత స్నేహాన్ని వ్యక్తిగతంగా ఉంచి ఉంటే బాగుండేదని.. ఇలా బహిరంగంగా ప్రదర్శించి…. ప్రాణాలొడ్డి పోరాడుతున్న తమ కుటుంబసభ్యుడ్ని పరోక్షంగా అయినా వ్యతిరేకించడమే అవుతుందని గుర్తించాల్సిందని అంటున్నారు. ఇప్పుడు బహిరంగంగా వెళ్లి మిత్రుడ్ని కలవాల్సిన పని లేదు. అలా చేయడం వల్ల అల్లు అర్జున్ పవన్ కు నష్టం చేస్తున్నారు. పిఠాపురం వెళ్లినా బాగుంటుందేమో కానీ నంద్యాల వెళ్లడం.. వైసీపీకి పరోక్షంగా ప్రచారం చేయడం… లాంగ్ రన్ లో అయినా అర్జున్ పై నెగెటివ్ రిమార్క్స్ పడేలా చేస్తుంది.