మరికొద్ది గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5గంటలలోపే ప్రచారం ముగించాల్సి ఉండటంతో ఆయా పార్టీల అధినేతలు,అభ్యర్థులు మిగిలిన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్రెడ్డి ఎన్నికల ప్రచార చివరి రోజు మూడు సభల్లో పాల్గొంటారు.ఉదయం 10 గంటలకు పల్నాడు జిల్లా చిలకలూరిపేట కళామందిర్ సెంటర్లో జరిగే సభలో పాల్గొననున్నారు. అనంతరం ఏలూరు జిల్లా కైకలూరులో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే సభకు హాజరవుతారు.మధ్యాహ్నం 3 గంటలకు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో జరిగే సభలో పాల్గొంటారు జగన్.
టీడీపీ అద్యక్షుడు చంద్రబాబు మధ్యాహ్నం 12.30 గంటలకు నంద్యాలలో సభకు హాజరవుతారు. రాజ్ థియేటర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన ప్రజా గళం సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు చిత్తూరులో ఏర్పాటు చేసిన ప్రజా గళం సభలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు.
తెలంగాణలో చివరి రోజు బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో పాల్గొననున్నారు. వికారాబాద్, వనపర్తిలో పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు షా.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి కామారెడ్డి రోడ్ షో లో పాల్గొననున్నారు. కామారెడ్డిలో బహిరంగ సభ నిర్వహించాలని ఏర్పాట్లు చేసిన చివర్లో షెడ్యూల్ లో మార్పులు చేశారు.
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్ర ముగియడంతో మధ్యాహ్నం 1గంటలకు తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ద్వారా ఆయన బీఆర్ఎస్ కు ఒటేయ్యాలని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేయనున్నారు.