ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్లు ఎవరూ ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగాయి. గత ఎన్నికల కంటే రెట్టింపు అయ్యాయి. ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4 లక్షల 30 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరిలో లక్షా 5 వేల మంది టీచర్లే ఉన్నారు.. 40 వేల మంది పోలీసులు ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలేట్ ఉపయోగించుకున్న వారు 2 లక్షల 38 వేల మంది మాత్రమే.. కానీ ఈ నంబర్ ఇప్పుడు రెట్టింపు అయ్యింది.
25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 4,44,216 మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,44,218 పోస్టల్ బ్యాలెట్ పోలయ్యాయి. ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్ ఇమేజ్ ఉంటే ఓటు వేయడానికి ఆసక్తి చూపించరు కానీ వ్యతిరేకత ఉంటేనే ఓటు రూపంలో చూపిస్తారన్న చర్చ జరుగుతుంది. గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఓటింగ్ తమకు అనుకూలమంటే.. తమకని అటు కూటమి, ఇటు వైసీపీ నేతుల చెప్పుకుంటున్నారు.
వైసీపీ నేతలు వీరిని కూడా ప్రలోభాలకు గురి చేయాలనుకున్నారు. కొన్ని చోట్ల 5 వేలు.. మరికొన్ని చోట్ల 3 వేలు అంటూ బేరసారాలు నడిచాయి. కొన్ని చోట్ల కాళ్లు కూడా పట్టుకున్నారు. కానీ తమకు ఐదేళ్ల పాటు చేసిన అన్యాయం గుర్తు చేసుకున్న ప్రతి ఉద్యోగి కసి తీర్చుకున్నారన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. ఏదైతేనేం అత్యధిక పోలింగ్ నమోదయ్యేందుకు ఉద్యోగులు ఓ దారి చూపించారని అనుకోవచ్చు.