వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిది ఎంత నేరో మైండో షర్మిల ఒక్కొక్కటిగా బయట పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం అంటే.. వారి వ్యక్తిత్వాన్ని కించ పర్చడమే అని జగన్ రెడ్డి అనుకుంటూ ఉంటారు. కొంత కాలంగా ఆయన చేస్తున్న రాజకీయం ఇదే. అయితే అదే వ్యూహాన్ని చెల్లి షర్మిల పై పాటిస్తున్నారు. తన సోషల్ మీడియా టీంతో విస్తృతంగా తిట్టించడంతో పాటు స్వయంగా తాను కూడా రంగంలోకి దిగి ఆమె వ్యక్తిత్వంపై నిందలేస్తున్నారు.
షర్మిలకు పదవి పిచ్చి పట్టుకుందని .. తాను ఓ పెద్ద కాంట్రాక్ట్ అడిగితే.. జగన్ అతి పెద్ద నిజాయితీపరుడిలాగా కుటుంబానికి మేలు చేసేందుకు ప్రజలు పదవి ఇవ్వలేదని చెప్పారంటూ రకరకాల కథలు వినిపించారు. చివరికి తాను స్వయంగా ఇంటర్యూల్లో అలాంటి భావన వచ్చేలా చెప్పారు. షర్మిలకు రాజకీయాల్లోకి వచ్చే అర్హత లేదని.. తనకు ఒక్కడికే ఉందని చెప్పుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి వ్యవహారంపై షర్మిల ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు జగన్ తనను అన్న మాటలతో పాటు … గతంలో జగన్ కోసం చేసిన కృషిని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటున్నారు. తనను అసలు రాజకీయాల్లోకి తెచ్చి జగనేనని.. ఆయన జైల్లో ఉన్నప్పుడు.. గత ఎన్నికల సమయంలో ప్రచారం చేయించుకున్నది ఎవరని ఆమె ప్రశ్నిస్తున్నారు. చెల్లికి రాజ్యసభ ఇస్తానని తల్లికి హామీ ఇచ్చి నెరవేర్చకుండా మోసం చేశారని షర్మిల బయట పెట్టారు.
జగన్ అన్న మాటలు చాలా నెగెటివ్ గా ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఆ మాటల్ని ఉపయోగించుకుని షర్మిల తనకు కావాల్సినంత సానుభూతి రాజకీయం చేస్తున్నారు. ఈ విషయంలో కౌంటర్ ఇవ్వడానికి జగన్.. వైసీపీ నేతల దగ్గర సరుకు లేకుండా పోతోంది.