ఇటీవల పదేపదే పెద్దపల్లి సీటును గెలుస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 14 – 15 స్థానాలను గెలవబోతుందని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన కేసీఆర్ ఇటీవల లెక్క మార్చారు. బీఆర్ఎస్ పెద్దపల్లి సీటు గెలుస్తోందని తరుచుగా ప్రస్తావిస్తుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారుతోంది. కేసీఆర్ వ్యాఖ్యలను చూస్తుంటే బీఆర్ఎస్ పెద్దపల్లి సీటు మాత్రమే గెలవబోతుందా..? అనే సందేహాలు వస్తున్నాయి.
పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలో నిలిపారు కేసీఆర్. అక్కడి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన బాల్క సుమన్ ను కూడా కాదని కొప్పులకే టికెట్ కేటాయించారు. సింగరేణి కార్మికుడిగా కిందిస్థాయి నుంచి ఎదిగొచ్చిన ఈశ్వర్ పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం ఉండటంతోపాటు వివాదరహితుడిగా పేరుండటంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ఖరారు చేశారనేది ఓపెన్ సీక్రెట్. ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీని కాంగ్రెస్ బరిలో నిలపడంతో వివేక్ ఫ్యామిలీని ఆర్థికంగా డీకొట్టి కొప్పుల గెలవలేరన్న అభిప్రాయాలు మొదట వినిపించాయి.
కాంగ్రెస్ గెలిచే సీట్లలో పెద్దపల్లి తప్పకుండా ఉంటుందని అంతా భావిస్తుండగా కేసీఆర్ మాత్రం పదేపదే పెద్దపల్లి బీఆర్ఎస్ దేనని వ్యాఖ్యానించడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. కొప్పుల అనుభవజ్ఞుడు కావడంతో..పెద్దపల్లి ఓటర్లు ఆయన వైపు చూస్తున్నారని కేసీఆర్ కు అందిన నివేదికలో తేలిందా..? మరేదేమైనా కారణమా..? అని బీఆర్ఎస్ వర్గాలు సైతం ఆరా తీస్తున్నాయి.