ఏపీలో నోట్ల విశ్వరూపం కనిపిస్తోంది. ప్రతీ పార్టీ ఓటర్కు డబ్బులు పంపుతోంది. ప్రతి ఓటర్ కు నాలుగు ఐదు వందల నోట్లు చేరుతున్నాయి. యావరేజ్ గా .. ఓటుకు రెండు వేలు ఖచ్చితంగా ఇస్తున్నారు. నాలుగు కోట్ల మంది ఓటర్లకు ఇది చేరుతోంది. ఇంత నగదు ఏపీలో ఎలా ప్రవహిస్తోంది.. ? బ్యాంకులకు తెలియకుండా ఈ నోట్ల్ల కట్టలు.. ప్రభుత్వాలకు.. వాటి ఇంటలిజెన్స్లకు తెలియకుండా.. సరఫరా అయిపోతున్నాయా ?
ఇటీవల హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ లారీలో అడుగున ప్రత్యేకంగా అరలు పెట్టి అందులో ఎనిమిదిన్న కోట్లు పెట్టి తెస్తూంటే పట్టుకున్నారు. అలాంటి లారీలు కొన్ని అప్పటికే ఏపీలోకి వచ్చేశాయమి.. మరికొన్ని ఇతర మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకున్నాయని ప్రచారం జరిగింది. తాజాగా తూ.గో జిల్లా లో ఓ వ్యాన్ ప్రమాదానికి గురైంది. అందులో ఉన్న అట్టపెట్టెల్లో మరో ఎనిమిది కోట్ల నగదు బయటపడింది. ఇది ప్రమాదానికి గురైంది కాబట్టి తెలిసింది లేకపోతే గమ్యానికి చేరుకునేదే. ఇంత యథేచ్చగా డబ్బులు పంపిణీ జరిగిపోతూంటే.. మన వ్యవస్థలు ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి.
ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అవసరమైన నిఘా, వ్యవస్థలు, అధికారగణం అంతా మనకు ఉంది. కానీ ఈ వ్యవస్థలు కొంత మంది కోసం.. చూసీచూడనట్లుగా ఉండటంతో అ సందుల్ని ఇతరులూ గట్టిగా ఉపయోగించుకుంటున్నారు. ఫలితంగా ఎన్నికల నిర్వహణ అనేది ఓ ఫార్స్ గా మారుతోంది. ముఖ్యంగా డబ్బుతో ఎన్నికల నిర్వహణ అనేది కామన్ అయిపోతోంది. ఇదంతా వ్యవస్థల చేతకానితనం.. ఎన్నికల నిర్వహణను తమ చేతుల్లోకి తీసుకోలేని ఈసీ నిర్వాకం కూడా. !