ఈసారి ఏపీ ఎన్నికలు హోరాహోరీగా సాగబోతున్నాయి. వైసీపీ – కూటమి పార్టీల మధ్య నువ్వా- నేనా అనే తరహాలో బిగ్ ఫైట్ నడిచింది. డీ అంటే డీ అనే స్థాయిలో ప్రచార పర్వం సాగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో నెలన్నర రోజులుగా ఎండల మించి ఏపీ పాలిటిక్స్ తో హీటేక్కాయి. ఒక్క అవకాశం పేరుతో గత ఎన్నికల్లో చంద్రబాబును కూడా కాదని జగన్ కు అధికారం కట్టబెట్టినా ఏపీ ప్రజలు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారోనని ఉత్కంఠ నెలకొంది.
ఈ ఎన్నికలు గతానికి పూర్తి భిన్నంగా జరుగుతున్నాయి. కౌరవ సభలో తాను ఉండలేనని.. సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తానని చంద్రబాబు ప్రకటనతో ఈ ఎన్నికలను టీడీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా గెలిచి వైసీపీ అహంకారాన్ని ఓడించాలని ఏడాది నుంచే ప్రచారాన్ని షురూ చేసింది. ఓ వైపు లోకేష్, మరోవైపు చంద్రబాబు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. అంతేకాదు భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలయ్య కూడా ప్రచారంలో తలో చేయి వేశారు.
కాగా, ఈ ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందా..? బీజేపీతో కలిసి సాగుతుందా..? అనే అనుమానాలకు చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే తెరదించింది. చంద్రబాబును వైసీపీ సర్కార్ కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని.. ఆ సమయంలోనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ చీలిపోకుండా టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని జనసేనాని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీని కూడా పొత్తు ప్రతిపాదనకు ఒప్పించి టీడీపీ- జనసేనలు సక్సెస్ అయ్యాయి.దీంతో ఏపీలో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రచారం చేపట్టింది.
ఇక, వై నాట్ 175 అంటూ ప్రగల్భాలు పలికిన వైసీపీ ప్రజా వేదిక కూల్చడం స్టార్ట్ చేసి… విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టిందన్న ఆరోపణలను మూటగట్టుకుంది. అదే సమయంలో జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతోపాటు అమరావతి రైతుల ఆందోళన, వివేకా హత్య కేసు,ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఈ ఎన్నికల్లో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బగా మారనుండటంతో పాటు గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు సహకరించిన షర్మిల వైసీపీపై తిరుగుబాటు జెండా ఎగరేయడం జగన్ కు మైనస్ గా మారింది.
దీంతో ఏపీ ఓటర్లు ఈసారి అనుభవజ్ఞుడికి ఓటేస్తారా..? ఉచిత పథకాలను అందిస్తూ సంక్షేమాన్ని పరుగులు పెట్టించామని ప్రకటించిన పార్టీకి మద్దతుగా నిలుస్తారా..? అన్నది తెలియాల్సి ఉంది.