‘హనుమాన్’ తరువాత ప్రశాంత్ వర్మ రేంజ్ పెరిగిపోయింది. ఆయన కోసం బాలీవుడ్ హీరోలు, అక్కడి నిర్మాణ సంస్థలు ఎదురు చూపుల్లో పడిపోయేంత సీన్ క్రియేట్ అయ్యింది. రణవీర్ సింగ్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జోరుగా జరుగుతోంది. అది ఇప్పుడు ఫైనల్ అయ్యింది కూడా. రణవీర్ తో ప్రశాంత్ వర్మ సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కబోతోంది. తెలుగు 360 సేకరించిన ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ ఏమిటంటే… దీనికి ‘బ్రహ్మరాక్షస’ అనే టైటిల్ ఖరారు చేశారు. అన్ని భాషల్లోనూ ఇదే టైటిల్ తో ఈ సినిమా విడుదల కానుంది.
‘అ’, ‘జాంబిరెడ్డి’, ‘హనుమాన్’.. ఇవన్నీ ఒకదానితో సంబంధం లేని కథలు. జోనర్లు. ‘బ్రహ్మరాక్షస’ కూడా ఆ తరహా జోనరే. ‘హనుమాన్’ నుంచి ప్రశాంత్ వర్మ సూపర్ హీరోస్ కథల వైపు ఆలోచించడం మొదలెట్టాడు. ‘బ్రహ్మరాక్షస’ కూడా ఈ సిరీస్‌లో భాగమే అని తెలుస్తోంది. కథ ఎప్పుడో ఫైనల్ అయిపోయింది. ఈ కథకు రణవీర్ కూడా ‘ఓకే’ చెప్పేశాడు. హిందీ సినిమాగానే ఈ చిత్రాన్ని పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందీలో తీసి, మిగిలిన భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ‘హనుమాన్ 2’ పై ప్రశాంత్ వర్మ ఫోకస్ పెట్టాడు. అది పూర్తయిన తరవాత… ‘బ్రహ్మరాక్షస’ ఉంటుంది.