ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ తన అంచనాను మరోసారి చెప్పారు. వైసీపీ ఘోర పరాజయం ఖాయమని అన్నారు. ఈ విషయాన్ని తాను ఏడాదిన్నర కిందటే జగన్ కు చెప్పానని స్పష్టం చేశారు. ఆర్టీవీ కోసం రవిప్రకాష్ .. ప్రశాంత్ కిషోర్ ను ఇంటర్యూ చేశారు. ఇందులో ఏపీ రాజకీయాలు జగన్ తో పని చేసిన అనుభవంపై చాలా విషయాలు పంచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దారి తప్పారని అన్నారు. ఆయన పెట్టుకున్నవాలంటీర్ వ్యవస్థ ద్వారా పార్టీ క్యాడర్ ను నిర్వీర్యం చేసుకున్నారని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థ తన ఆలోచన కాదని.. అన్నీ వాలంటీర్లు చేస్తే పార్టీ క్యాడర్ ఏమైపోవాలని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ కోసం ని చేసిన తర్వాత ప్రశాంత్ కిషోర్ తమిళనాడు, బెంగాల్ డీఎంకే, తృణమూల్ కోసం పని చేశారు. ఆ తర్వాత ఆయన రాజకీయ వ్యూహకర్త పనులను మానుసుకున్నారు. ఐప్యాక్ కోసం పని చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేస్తున్నారు. ఏడాదిన్నర కిందట జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో కలిశారని.. ఏపీ ఎన్నికలపై మాట్లాడారని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన సంభాషణలో జగన్ ఓడిపోబోతోున్నారని చెప్పానన్నారు. అయితే జగన్ మాత్రం తాను అందరి ఖాతాల్లో డబ్బులేస్తున్నానని ఎందుకు గెలవనని ఆయన వాదించారని నూట యాభై ఐదు సీట్లు గెలుస్తానని చెప్పారన్నారు. ఆ తర్వాత ఇక జగన్ ను కలవలేదన్నారు.
పాలనలో జగన్ ఒక్క తప్పు మాత్రమే కాదని ఎన్నో లాజికల్ మిస్టేక్స్ చేశారని దాని వల్ల వైసీపీ భారీగా నష్టపోతుందన్నారు. స్జజల లాంటి వాళ్లు 151 సీట్ల పార్టీని 51 సీట్లకు తీసుకు వస్తున్నారని సెటైర్ వేశారు. తాను ఎవరు డబ్బులు ఇస్తే వారిపై మాట్లాడుతానని వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపైనా పీకే సెటైర్లు వేసారు. జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో తెలుసుకోవాలని సెటైర్లు వేశారు.
బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలపైనా స్పందించారు. బొత్స సత్యనారాయణ టీడీపీలోకి వెళ్లడానికి ఒప్పందం చేసుకున్నారని సంచలన విషయం బయట పెట్టారు. గెలిచిన పార్టీలోనే ఉండాలని ఆయన అనుకుంటారని స్పష్టం చేశారు. మూడు రాజధానుల ఆలోచనకూడా తనది కాదని .. 2019లో వైసీపీ గెలిచిన తర్వాత .. తన సేవలు మళ్లీ అందించలేదన్నారు. ఐ ప్యాక్ మాత్రం ఇప్పటికీ అందిస్తోందన్నారు.