ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో వరుస ఓటములతో నిరుత్సాహపరిచిన బెంగళూరు, ఇప్పుడు అనూహ్యంగా పుంజుకొంది. వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి, ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. ఆదివారం దిల్లీపై 47 పరుగుల తేడాతో గెలిచి, పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. తదుపరి మ్యాచ్‌లో ఆర్సీబీ చెన్నైతో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో మెరుగైన రన్‌రేట్ తో గెలిస్తే, ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టే అవకాశం ఉంది. నిజానికి బెంగళూరు ఈ స్థాయిలో పుంజుకొంటుందని ఎవరూ అనుకోలేదు. ఏ మ్యాచ్ ఓడిపోయినా ఇంటికే అనుకొన్న దశ నుంచి, ఒక్కో మ్యాచ్ గెలుస్తూ, ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకొంది.
ఆర్సీబీ బ్యాటింగ్ గురించి ఎవరికీ బెంగలేదు. కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీనే. ఆరెంజ్ క్యాప్ కూడా అతని దగ్గరే ఉంది. పడిదార్ కూడా మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు. డూప్లెసిస్, జాక్స్, దినేష్ కార్తీక్ అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తున్నారు. అయితే బెంగంతా బౌలింగ్ గురించే. సిరాజ్ తో సహా ఎవరూ లయలో లేకపోవడంతో, బెంగళూరు పూర్తిగా బ్యాటింగ్ పిచ్ కావడంతో తొలి దశలో మ్యాచ్‌ల్ని చేజార్చుకొంది ఆర్సీబీ. అయితే ఇప్పుడు బౌలర్లు కూడా ఫామ్‌లోకి వచ్చేశారు. వాళ్లే ఆర్సీబీ ని గెలిపిస్తున్నారు. దిల్లీపై గెలవడానికి కారణం బౌలర్లే. ఎందుకంటే చినస్వామి స్టేడియంలో 188 పరుగుల ఛేదన అంటే.. ఆడుతూ పాడుతూ చేసేయొచ్చు. కానీ… బెంగళూరు కట్టుదిట్టంగా బంతులేసింది. పైగా బెంగళూరు ఫీల్డర్లు మైదానంలో చురుగ్గా కదులుతున్నారు. వాళ్ల క్యాచింగ్, ఫీల్డింగ్ అత్యున్నతంగా కనిపిపిస్తున్నాయి. దాంతో చివరి దశలో బెంగళూరు పుంజుకొంది. ప్లే ఆఫ్ బెర్త్ ఖాయం చేసుకోవడమే బెంగళూరు ముందున్న లక్ష్యం. అది జరిగిపోతే… అభిమానుల బెంగ తీరిపోయినట్టే.