సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తోంది. కేవలం ఓటీటీ బిజినెస్ కోసం తయారయ్యే సినిమాలు వున్నాయి. సినిమా ఓటీటీకి వస్తే చూద్దామనుకునే ఆడియన్స్ కూడా పెరుగుతున్నారు. అయితే ఈ ట్రెండ్ లో సినిమా టాక్ మారిపోతోంది. థియేటర్స్ లో హిట్టు కొట్టిన సినిమాపై ఓటీటీ ఆడియన్స్ ఇచ్చే తీర్పు మారుతోంది.
హనుమాన్, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, టిల్లు2.. ఈ ఏడాది థియేటర్స్ లో అదరగొట్టిన సినిమాలివి. అయితే ఓటీటీలో చూసిన మెజార్టీ ప్రేక్షకులు తీర్పు మాత్రం వేరేలా వుంది. మహా అద్భుతం అన్నంతగా ‘హను మాన్’ లో ఏముంది? అని ప్రశ్నించారు. హీరోయిన్ క్యూట్ లుక్స్ తప్పితే `ప్రేమలు`లో చెప్పుకునే మరో అంశం లేదు కదా? అని పెదవి విరిచారు. క్లాసిక్ అనుకునేంత సినిమా కాదు మంజుమ్మల్ బాయ్స్ అన్నారు. మమ్ముటి భయపెట్టే గెటప్ తప్పితే భ్రమయుగంలో విషయం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. డేజావు స్టయిల్ లో చూపించిన సీన్స్, డైలాగ్స్ ని మళ్ళీ రిపీట్ చేయడం తప్పితే టిల్లు2 లో కొత్తదనం ఏమిటి? అని ప్రశ్నించారు.
థియేటర్స్ లో హిట్ కొట్టిన సినిమాల పరిస్థితి ఇలా వుంటే.. నిరాశ పరిచిన సినిమాల పరిస్థితి మరోలా వుంది. థియేటర్స్ లో ఫ్లాఫ్ అయిన కొన్ని సినిమాలకు ఓటీటీలో అనూహ్యంగా సపోర్ట్ దొరుకుతోంది. గుంటూరు కారం మహేష్ బాబు అభిమానులని సైతం నిరాశ పరిచింది. అందులో ఆయన క్యారెక్టరైజేషన్, కథ, కథనాలు, సినిమాని నడపించిన తీర్పు ఏ మాత్రం ఆడియన్స్ కి రుచించలేదు. కానీ సినిమా ఓటీటీ వచ్చిన తర్వాత ఇక్కడ ఆడియన్స్ నుంచి సపోర్ట్ దొరికింది. ‘సినిమా అంత బ్యాడ్ గా ఏమీ లేదు. మహేష్ బాబు ఇలాంటి ఫ్యామిలీ స్టొరీ చేయడం కొత్తగా వుందనే అభిప్రాయలు వచ్చాయి.
మరికొన్ని సినిమాల విషయంలో ఓటీటీ ఆడియన్స్ స్పందన షాకింగ్ గా వుంటుంది. మొన్న వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా నిజంగానే అంచనాలని అందుకోలేకపోయింది. అయితే థియేటర్ ఆడియన్స్ సినిమా చూసి ‘ఎదో ప్రయత్నం చేశారు కానీ కుదరలేదు’ అని ఊరుకున్నారు. కానీ ఓటీటీ ఆడియన్స్ చీల్చి చెండాడారు. థియేటర్స్ లో కంటే ఓటీటీకి వచ్చిన తర్వాత సినిమా విపరీతంగా ట్రోల్స్ బారిన పడింది. ‘మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే. కానీ దోసెలు అలా వేసుకోవాలి మాకు తెలీదు’ అంటూ తెగ సెటైర్లు వేశారు. అదొక్కటే కాదు అందులో చూపించిన చాలా సీన్స్ ని ఉతికారేశారు.
అసలు థియేటర్, ఓటీటీ తీర్పు విషయంలో ఎందుకింత వ్యత్యాసం ఉంటుందని ప్రశ్నించుకుంటే బోలెడు కారణాలు కనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా థియేటర్ సినిమాని ఓటీటీ అడియన్స్ ని ద్రుష్టిపెట్టుకుని తీయరు. ఒక సీన్ రాసేటప్పుడు, తీసేటప్పుడు గ్యాలరీని ఉద్దేశించే డిజైన్ చేస్తారు. ఒక సమూహం అంతా కూర్చుని ఫలానా సీన్ చూస్తున్నపుడు ఎలా రియాక్ట్ అవుతుందనే కొలమానాలతోనే రూపొందిస్తారు.
హనుమాన్ థియేటర్స్ లో ఇచ్చిన కిక్ ఓటీటీ లో రాకపోవడానికి కారణం అదే. దర్శకుడు క్రియేట్ చేసి ఆ యూనివర్స్ ఓటీటీలో వచ్చేసరికి చిన్నగా కనిపించివుండవొచ్చు. అందుకే చాలా మంది కామెంట్స్ లో ‘ఓ గూడెంలో జరిగిన కథకు ఇంత బిల్డప్ ఇచ్చేరేంటి? అనే వాఖ్య కామన్ గా కనిపించింది. పైగా ఈ సినిమాకు యూనిమస్ గా హిట్ టాక్ వచ్చింది. దాదాపు అందరూ మూడుకి పైగానే రేటింగ్ ఇచ్చారు. ఇవన్నీ ఓటీటీ ఆడియన్స్ లో అంచనాలు పెంచేయడం సహజం. ఆ అంచనాలని తగ్గట్టుగా సినిమా లేదని ఫీలింగ్ కలగడం కూడా సహజమే.
ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్, భ్రమయుగం, డిజేటిల్లు సినిమాల పరిస్థితి కూడా ఇదే. థియేటర్ ఆడియన్స్ అంతా ఈ సినిమాలని చాలా ఎంజాయ్ చేశారు. అందరూ బావున్నాయని మెచ్చుకున్నారు. ప్రేమలు నిజంగా ఒక సమూహంతో కలసి చూస్తే తెగ నవ్వించే సినిమా. చిన్న చిన్న వన్ లైనర్స్ హిలేరియస్ గా అనిపిస్తాయి. ‘నువ్వేమైనా ఆస్థాన కోడివా?’ అంటే థియేటర్ అంతా ఘోల్లున నవ్వింది. కానీ అదే డైలాగ్ ని ఎదో మొబైల్ డివైజ్ లో చూస్తే ఆ కిక్ రాకపోవచ్చు. ఇక బ్రహ్మయుగం, మంజుమ్మల్ బాయ్స్ అయితే కేవలం థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీసిన సినిమాలు. విజువల్స్, సౌండ్ డిజైన్ థియేటర్స్ లో చూసినప్పుడే కథలో లీనం చేయిస్తాయి. డిజేటిల్లు కూడా గ్యాలరీ కోసం తీసిన సినిమా. అందులోని వన్ లైనర్స్ ఓటీటీ కంటే థియేటర్స్ లోనే పేలుతాయి.
ఓటీటీలు పెరిగిన తర్వాత సీరియస్ మూవీ గోయర్స్ కూడా థియేటర్స్ కి వెళ్ళడం తగ్గించారు. అందులో చాలా మంది సోసల్ మీడియాలో తమ అభిప్రాయలు వ్యక్తం చేసేవారు వున్నారు. సినిమా ఓటీటీకి వచ్చిన తర్వాత రివ్యూలు ఇస్తున్నారు. అయితే ఈ రివ్యూలపై థియేటర్లో వచ్చిన రెస్పాన్స్ ప్రభావం చూపుతోంది. బావుందని చెప్పిన సినిమాలో లోటుపాట్లు వెదకడం విమర్శకుల నైజం. ఈ రకంగా థియేటర్స్ లో మెచ్చుకున్న సినిమాలో లోపాలు, నొచ్చుకున్న సినిమాల్లో మెచ్చుకునే కోణంలోనే వారి అభిప్రాయాలు సాగుతున్నాయి.
ఏదేమైనా థియేటర్ సినిమాకి థియేటర్ తీర్పే అంతిమం. ‘అతడు’ సినిమా థియేటర్స్ కంటే టీవీల్లో తెగ అడేసింది. ఆ సినిమాకి క్లాసిక్ ట్యాగ్ బుల్లితెర ప్రేక్షకులే ఇచ్చారు. ఓ సందర్భంలో దీనిపై తన అభిప్రాయాన్ని తివిక్రమ్ ని అడిగితే.. ‘అతడు థియేటర్స్ కోసం తీసిన సినిమా. టీవీలో గొప్పగా ఆడుతుందంటే అది నాకేం ఆనందాన్ని ఇవ్వదు’ అని నిర్మోహమాటంగా చెప్పారు. నిజమే.. థియేటర్స్ కోసం సినిమాకి థియేటర్ ఆడియన్స్ ఇచ్చిన తీర్పే ఫైనల్.