సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ నేతలైతే ఇతర కారణాలు చెప్పి ఉండేవారేమో కానీ, మంత్రి రోజా సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేశారు.
జగన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు, లోకేష్ లను వ్యక్తిగతంగా తిట్టిపోసిన రోజా తన ఓటమిని నేరుగా ఒప్పుకుంటారా..? అవకాశమే లేదు. మంత్రిగా కూడా కొనసాగి ఓడిపోయారంటే ఆమె క్రెడిబులిటి దెబ్బతింటుంది.అందుకే సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేశారు. సర్వే ఫలితాల ప్రకారం ఆమె ఓటమి పాలైతే ఆమె రాజకీయం హేళనకు గురి అవుతుంది.
చంద్రబాబు, లోకేష్ లను తిట్టపోయడానికి సమయం కేటాయించి సొంత సీటులో ఓడిపోయారనే విమర్శలు తలెత్తనున్నాయి. ఓ రకంగా అది రోజాకు అవమానకరమే. అందుకే నగరిలో తనను ఓడించడం కోసం సొంత పార్టీ నేతలే కుట్రలు చేశారని , వ్యూహాత్మకంగా ఓటమిని పార్టీ నేతలపైకి నెట్టివేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తనను ఓడించడం కోసం టీడీపీ నేతల కన్నా వైసీపీ నేతలే కుయుక్తులు పన్నారని , కేజే కుమార్ ఆయన వర్గీయులు తన ఓటమి కోసం పని చేశారంటూ చెప్పుకొచ్చారు రోజా. ఇదంతా ఆమె స్వయంకృతాపరాధమే. అయినా, వాస్తవాలను పట్టించుకోకుండా పోలింగ్ రోజున సొంత పార్టీ నేతలను నిందిస్తే ఎం ప్రయోజనం..?