మంచు విష్ణు ఏం మంత్రమేశాడో ఏమో, ‘కన్నప్ప’ కోసం చాలామంది స్టార్లని తన టీమ్ లోకి తీసుకొన్నాడు. అందులో ప్రభాస్ ఒకడు. ఈరోజుల్లో ప్రభాస్ తో సినిమాలో ఓ పాత్ర చేయించడం ఏమంత ఆషామాషీ వ్యవహారం కాదు. అది అతిథి పాత్ర అయినా సరే. ఎందుకంటే ప్రభాస్ ఉన్న బిజీ షెడ్యూల్ లో మరో సినిమాకు డేట్లు కేటాయించడం చాలా కష్టమైన విషయం. అయినా సరే.. ‘కన్నప్ప’లో ఓ కీలక పాత్ర చేయడానికి ప్రభాస్ముందుకొచ్చాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ పై కీలకమైన సన్నివేశాల్ని పూర్తి చేశారు. ప్రభాస్ పార్ట్ అయిపోయినట్టే.
అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ పైసా కూడా పారితోషికం తీసుకోలేదు. మోహన్ బాబుపై తనకున్న గౌరవం, ఇష్టంతో ఈ సినిమాని ఫ్రీగా చేసినట్టు తెలుస్తోంది. మోహన్‌బాబుతో ప్రభాస్‌కు మంచి అనుబంధం ఉంది. ‘బుజ్జిగాడు’లో ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచీ.. వీరి మైత్రి బలపడింది. మోహన్ బాబు కోరిక మేరకు ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ ముందుకొచ్చాడు. అన్నింటికంటే ముఖ్యంగా పెదనాన్న కృష్ణంరాజుకు ‘కన్నప్ప’ ఇష్టమైన సబ్జెక్ట్. ప్రభాస్ తో ‘భక్త కన్నప్ప’ రీమేక్ చేద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. పెదనాన్న కోరికని కొంత వరకూ ఈ సినిమాతో నెరవేర్చే ప్రయత్నం చేశాడు ప్రభాస్. నిజానికి ముందు ఒక సన్నివేశానికే ప్రభాస్ పాత్ర పరిమితం. కానీ… ఆ తరవాత లెంగ్త్ పెరిగింది. అయినా సరే, ప్రభాస్ తన కాల్షీట్లు సర్దుబాటు చేశాడు.
ప్రభాస్ ఒక్కడే కాదు, ఈ సినిమాలో అతిథి పాత్రల్లో చేయడానికి ముందుకొచ్చిన చాలామంది నటీనటులు పారితోషికం గురించి ఆలోచించలేదని తెలుస్తోంది. అయితే మోహన్ బాబు మాత్రం `విలువైన` కానుకల్ని రిటర్న్ గిఫ్ట్ రూపంలో ఇవ్వబోతున్నట్టు సమాచారం అందుతోంది. అక్షయ్ కుమార్ మాత్రం రోజువారీ పారితోషికానికే సినిమా పూర్తి చేసినట్టు తెలుస్తోంది.