ఏ ఆటైనా మైదానంలో జట్టు సభ్యులంతా సమష్టిగా ఆడితేనే అందం, విజయం. ఒకరిపై మరొకరు కస్సుబుస్సులాడుతుంటే, కయ్యానికి కాలుదువ్వుతుంటే, అసలు జట్టు సభ్యుల మధ్య సయోధ్య లేకపోతే – ప్రత్యర్థులపై ఎలా తలపడతారు? అది ఆటగాళ్లకే కాదు, ఆటకూ మంచిది కాదు. కానీ టీమ్ ఇండియాలో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యాకూ, మిగిలిన జట్టు సభ్యులకూ ఏమాత్రం పడడం లేదని, ఎవరికి వారు ఎడమొహం, పెడమొహంలా ఉంటున్నారన్న వార్తలు క్రీడా రంగాన్ని, ముఖ్యంగా క్రికెట్ ని విస్మయపరుస్తున్నాయి. వరల్డ్ కప్ ముందు ఈ అలకలు అవసరమా? అంటూ సగటు క్రికెట్ అభిమాని నివ్వెరపోతున్నాడు.
ముంబై జట్టు పగ్గాలు హార్దిక్ పాండ్యాకు అప్పగించినప్పటి నుంచీ పరిస్థితులు చేజారిపోయాయి. కెప్టెన్సీ వచ్చింది కదా అని అంతా నేనే అన్నట్టు హార్దిక్ వ్యవహరించడం, సీరియర్లకు, తోటి ఆటగాళ్లకూ గౌరవం ఇవ్వకపోవడంతో కెప్టెన్‌గా, ఆటగాడిగా తోటి వాళ్ల మధ్య పలుచన అయిపోయాడు హార్దిక్. ముంబై జట్టు ప్రస్తుతం రెండుగా చీలిపోయింది. హార్దిక్‌ని సపోర్ట్ చేసేవాళ్లు కొందరు, తనని వ్యతిరేకించేవాళ్లు మరికొందరు. ముఖ్యంగా బుమ్రా, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ హార్దిక్ ని అస్సలు లెక్క చేయడం లేదని తెలుస్తోంది. ఇటీవల కొలకొత్తాతో జరిగిన మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్లో హార్దిక్ పట్ల, ఈ ముగ్గురూ ప్రవర్తించిన తీరు చర్చనీయాంశంగా మారింది. హార్దిక్ ప్రాక్టీస్‌కు వచ్చినప్పుడు అక్కడి నుంచి బుమ్రా, సూర్య కుమార్, తిలక్ వర్మలు వెళ్లిపోవడం, హార్దిక్ ఎదురైనా మాట్లాడకపోవడం.. ఇవన్నీ అందర్నీ షాక్ కు గురి చేశాయి. హార్దిక్‌ని కెప్టెన్ చేయడం చాలా మంది ముంబై ఆటగాళ్లకు నచ్చలేదు. దాంతో ఇలా తమ నిరసన వ్యక్తం చేశారనుకోవాలి.
అయితే ఇది ఐపీఎల్ తోనే ఆగదు. రేపు వరల్డ్ కప్‌లోనూ ఈ ప్రభావం కనిపించే ప్రమాదం ఉంది. అసలే వరల్డ్ కప్ ప్రాపబుల్స్ లోంచి హార్దిక్ ను తొలగిస్తారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. హార్దిక్ జట్టులో ఉండడం చాలామంది ఆటగాళ్లకు ఇష్టం లేదని, ముఖ్యంగా, ఫామ్ లేకపోవడం సాకుగా చూపించి, హార్దిక్‌కు తప్పించాలని చూస్తున్నారని క్రికెట్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇవన్నీ దాటుకొని తుది జట్టులో హార్దిక్ ఉంటే, మిగిలిన ఆటగాళ్లతో సయోధ్య కుదురుతుందా? ఈ అలకలు, చిరుబుర్రుల పిల్లలాటల వల్ల మైదానంలో కసిగా కలసి కట్టుగా ఆడగలరా? – ఇవన్నీ ప్రశ్నలే. ఐపీఎల్ వల్ల వరల్డ్ కప్‌కు మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని బీసీసీఐ భావించింది. కానీ సీన్ రివర్స్ అయి, ఆటగాళ్ల మధ్య కలహాలకు కారణమైంది. ఈ ప్రభావం ఎంత వరకూ ఉంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.