‘పుష్ష’ టీమ్ ని ఫహద్ ఫాజల్ బాగా ఇబ్బంది పెడుతున్నాడు. తన డేట్లు ఇస్తే కానీ ‘పుష్ష 2’ షూటింగ్ పూర్తవ్వదు. ఆయనేమో డేట్లు ఇవ్వడం లేదు. ఇది వరకే ఫహద్ గంపగుత్తగా ‘పుష్ష 2’కి కొన్ని డేట్లు కేటాయించాడు. కానీ అప్పుడన్న పరిస్థితుల్లో షూటింగ్ జరగలేదు. దాంతో ఫహద్ డేట్లు వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు కావాలి అనుకొన్నప్పుడు ఆయన డేట్లు దొరకడం లేదు. ప్రస్తుతం ఫహద్ కొన్ని మలయాళం ప్రాజెక్టులతో బిజీగా ఉండిపోవడం వల్ల.. ‘పుష్ష’కు కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయడం లేదు.
మరోవైపు ఫహద్ మాటలు కూడా సుకుమార్ అండ్ టీమ్ ని ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుష్ష వల్ల తనకు ఒరిగిందేం లేదని, పుష్షలో తన పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదని, మలయాళం సినిమాల ద్వారానే తనకు పేరొచ్చిందని, అక్కడే సంతృప్తి దొరుకుతోందన్న ధోరణిలో మాట్లాడాడు ఫహద్. ‘పుష్ష 2’ లో కీలక పాత్ర పోషిస్తూ, పుష్ష వల్ల ఒరిగిందేం లేదనడం టీమ్ ని ఇబ్బంది పెట్టే అంశమే. పుష్ష వల్ల చాలామందికి పేరొచ్చింది. అందులో ఫహద్ ఫాజల్ కూడా ఉన్నాడు. నిజానికి పుష్ష 1లో ఫహద్ విలనిజాన్ని సుకుమార్ కూడా పెద్దగా చూపించలేదు. కథని రెండు భాగాలుగా విడదీయడం వల్ల, పార్ట్ 1లో ఫహద్ పాత్రకు పెద్దగా స్కోప్ దక్కలేదు. కాకపోతే.. ‘ఒక్కటి తగ్గింది’ అంటూ తన పొగరు, అహంకారం చూపించిన సీన్ థియేటర్లో బాగా పండింది. తన ఇంట్రడక్షన్ సీన్ సైతం సుకుమార్ బాగా రాశాడు. ‘పుష్ష 2’లో ఫహద్ పాత్ర చాలా కీలకం. ఈ సినిమా మొత్తం బన్నీ – ఫహద్ ల ఈగోవార్ చుట్టూనే నడుస్తుంది. అయినప్పటికీ… ‘పుష్ష’ని ఇలా చిన్నచూపు చూడడం ఏమిటో? ‘పుష్ష’ గురించి ఫహద్ ఇలా మాట్లాడడం సుకుమార్కీ, అతని సన్నిహితలకూ ఏమాత్రం నచ్చలేదట. ఇదే విషయంపై సుకుమార్ కాంపౌండ్ లో చర్చ నడుస్తోందని తెలుస్తోంది.