లోక్ సభ ఎన్నికలు ముగియడంతో తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికపైనే నెలకొంది. ఈ నెల 27న ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానానికి బైపోల్ జరగనున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికపైనే పార్టీలు ఫోకస్ పెంచాయి. సిట్టింగ్ సీటు కాపాడుకోవాలని బీఆర్ఎస్ పావులు కడుపుతుండగా, కాంగ్రెస్, బీజేపీలు ఎలాగైనా నెగ్గి తీరాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.
ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ స్థానానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. జనగాం ఎమ్మెల్యేగా పల్లా ఎన్నిక కావడంతో జరుగుతోన్న ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే, స్వతంత్ర అభ్యర్థులుగా కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ తోపాటు నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తోన్న అశోక్ కూడా పోటీలో ఉండటంతో ఈ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది.
గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ప్రచారం మొదలు పెట్టారు. తన ఆస్తులను కూడా ప్రభుత్వానికి ధారాదత్తం చేసి పెద్ద చర్చకు తెరలేపారు. 2021లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన మల్లన్న 1.49లక్షల ఓట్లు సాధించి పల్లాకు ముచ్చెమటలు పట్టించారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో మల్లన్నను గ్రాడ్యుయేట్స్ ఆదరిస్తారా..?అనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు బీఆర్ఎస్ ఉనికిపై సందేహాలు వ్యక్తం అవుతోన్న వేళ ఈ ఉప ఎన్నికను పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. పల్లాను మరోసారి ముందుంచి ఏనుగుల గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తుండగా మరోవైపు ఎలాగైనా గెలవాలని బీజేపీ కూడా పట్టుదలతో కనిపిస్తోంది. అలాగే, నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతూ నిరుద్యోగుల గొంతుకగా పేరొందిన అశోక్ కూడా తన మిత్రులతో కలిసి క్యాంపెయిన్ షురూ చేశారు.
అయితే, పట్టభద్రుల ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల ఫియర్ పట్టుకుంది. జడ్సన్, అశోక్ ల పోటీ కారణంగా ఓట్లు చీలి తమ ఓటమికి దారితీస్తుందా ..? అని ఆందోళన చెందుతున్నారు.