ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇవ్వాళ 2016-17 ఆర్ధిక సం.లకి బడ్జెట్ ని మధ్యాహ్నం 12.00 గంటలకి శాసనసభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తరువాత రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ని శాసనసభకి సమర్పిస్తారు. రాష్ట్ర బడ్జెట్ సుమారు రూ.1.30 కోట్లు ఉండే అవకాశం ఉంది.
పోలవరం, రాజధాని నిర్మాణానికి కేంద్రప్రభుత్వం తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటిని తమ ప్రభుత్వమే నిర్మిస్తుందని ఈమధ్య తరచూ చెపుతున్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి శక్తికి మించినపనే అయినప్పటికీ, కేంద్రానికి తమ అసంతృప్తిని తెలియజేయడానికే అన్నట్లుగా ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో పోలవరానికి రూ.3,300 కోట్లు రాజధాని నిర్మాణానికి రూ. 2,000 కోట్లు కేటాయించబోతున్నట్లు సమాచారం.
ఈసారి కేంద్రబడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకి రూ.100 కోట్లు మాత్రమే కేటాయించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విధంగా ప్రతీ బడ్జెట్ లో కేటాయింపులు జరిపినట్లయితే ఆ ప్రాజెక్టు ఎన్నటికీ పూర్తయ్యే అవకాశం ఉండదు. దానిని వచ్చే ఎన్నికలలోగా పూర్తి చేసి చూపిస్తామని రాష్ట్ర బారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు నిన్న శాసనసభలో చాలా గట్టిగా చెప్పారు.
2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో రాష్ట్ర రాజధాని నిర్మాణానికి అన్ని విధాల సహకరిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చొరవ వలన రూ.1,600 కోట్లు మాత్రం మంజూరు అయ్యేయి. ఈసారి కేంద్ర బడ్జెట్ లో కూడా రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చాలా అసంతృప్తిగా ఉంది. అందుకే ఈసారి రాష్ట్ర బడ్జెట్ లో రాజధాని నిర్మాణం కోసం రూ.2,000 కోట్లు కేటాయించబోతోందని తెలుస్తోంది.
అమరావతిని స్విస్ ఛాలెంజ్ పద్దతిలో నిర్మించబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ దానికి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ సంస్థల గొంతెమ్మ కోరికలు తీర్చడం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా కష్టంగా మారింది. ఆ కారణంగా దాదాపు రెండేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకు రాజధాని నిర్మాణ పనులు మొదలుకాలేదు. కనుక కేంద్రం ఇచ్చిన సొమ్ముకి రాష్ట్రం తరపున కూడా మరో రూ.2,000 కోట్లు కలిపి, దానితో రాజధాని ప్రాంతంలో పనులు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందు పనులు మొదలుపెడితే నిధుల కోసం కేంద్రంపై కూడా ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ విదేశీ సంస్థలు తమ గొంతెమ్మ కోరికలను పక్కనపెట్టి రాజధాని నిర్మాణానికి ముందుకు వస్తే ఇంక నిధుల సమస్యే ఉండదు.