ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
పోలింగ్ ముగిసిన మరుసటి రోజున కూడా టీడీపీ – వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు వెంటనే 144సెక్షన్ అమలు చేయాలనే ఆదేశాలతో పల్నాడు జిల్లాలో పోలీసులు భారీగా మొహరించారు.
నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల,సత్తెనపల్లి ,పెదకూరపాడు,గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం నుంచి 144 సెక్షన్ అమలులో ఉంది. పల్నాడుకు వెళ్ళే దారులలో తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. రాత్రి నుంచి ఐజీ సర్వ శ్రేష్ఠ మాచర్లలోనే మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సీనియర్ పోలిసు అధికారుల నేతృత్వంలో 2300మంది సిబ్బందితో భద్రత ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
మరోవైపు పల్నాడులో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈసీ పలు సమస్యాత్మక నియోజకవర్గాలపై నిఘా ఉంచింది. తిరుపతి, తాడిపత్రి,చంద్రగిరితో పాటు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పరిస్థితిని సమీక్షించాలని అధికారులను ఈసీ ఆదేశించింది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపాలని భావిస్తోంది ఈసీ. మంగళవారం తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి నానిపై వైసీపీ కార్యకర్తలు దాడులకు తెగబడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఏపీ అంతటా పరిస్థితిని చక్కదిద్దేందుకు సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను కఠినంగా వ్యవహరించాలని ఈసీ స్పష్టం చేసింది.