మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీని, ఈసారి కాంగ్రెస్ తో కలిసి ఆ పార్టీని కేజ్రీవాల్ మట్టి కరిపిస్తారా..? అనే చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో ఏడు లోక్ సభ స్థానాలకు గాను ఆప్ 4చోట్ల, కాంగ్రెస్ మూడు చోట్ల పోటీ చేస్తున్నాయి.ఆరో విడతలో ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మొన్నటి వరకు కేజ్రీవాల్ జైలులో ఉండటంతో ఆప్ శ్రేణులు, అభ్యర్థులు నిరుత్సాహంతో కనిపించారు. తాజాగా ఆయనకు బెయిల్ రావడంతో ఆప్ లో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇండియా కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా బుధవారం లఖ్నవూ, 16న జమ్షెడ్పూర్, 17న ముంబైలో పర్యటించడం ద్వారా ఆయా ప్రాంతాల్లో కూటమి కొంత పుంజుకోనుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే, అరవింద్ కేజ్రీవాల్ పై లిక్కర్ స్కామ్ మరకలు ఉండటంతో అదేమైనా ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం చూపనుందా..? అనే చర్చ కొనసాగుతుండగా..కేజ్రీవాల్ ను బీజేపీ కావాలనే టార్గెట్ చేసిందన్న అభిప్రాయం ఓటర్లలో ఉన్నట్లు కూటమి అంచనా వేస్తోంది. పైగా, కేజ్రీవాల్ ను రాజకీయంగా ఎదుర్కోలేక అరెస్ట్ చేయించారనే కూటమి నేతల వాదనను మెజార్టీ ఓటర్లు విశ్వసిస్తే ఢిల్లీలో మరోసారి క్లీన్ స్వీప్ చేయాలనుకున్న బీజేపీ ఆశలు ఆడియాశలు అయినట్లే.
ఢిల్లీలో ఆప్ – కాంగ్రెస్ నేతల మధ్య విబేధాలు ఉన్నాయి. పలువురు కాంగ్రెస్ ను వీడారు కూడా. ఇట్లాంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ బయటకు రావడం రెండు పార్టీల మధ్య ఐక్యతకు దారితీస్తుందని, బీజేపీని ఎదుర్కొనేందుకు ఈ పరిణామం తోడ్పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే , ప్రత్యర్దులుగా ఉన్న పార్టీలు ఇప్పుడు ఏకం కావడంతో ఇరు పార్టీల ఓట్ల షేరింగ్ ఎంతవరకు ఉంటుందోననేది ఆసక్తికరంగా మారింది.