75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే లేదని ఆయన ఉన్నంత కాలం ఆయనే ప్రధాని అని అమిత్ షా చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ మరి బీజేపీ విలువలు ఏమయ్యాయి అని ప్రశ్నలు ఆ పార్టీకి తగులుతున్నాయి.
భారతీయ జనతా పార్టీ మోడీ, షా చేతుల్లోకి వచ్చిన తర్వాత 75 ఏళ్లు దాటిన వారికి కీలక పదవులు ఇవ్వడం.. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం మానేశారు. ఈ నిబంధన చూపించి అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లాంటి దిగ్గజాల్ని కూడా పక్కకు తప్పించారు. ఇప్పుడీ నిబంధనతోనే నరేంద్రమోడీకి మాత్రం వర్తించదని చెబుతున్నారు. అలాంటి పరిస్థితిని మోదీ సృష్టించారు. బీజేపీకి ఆయన తప్ప మరొకరు కష్టం అన్న భావన కల్పించారు. నరేంద్రమోదీ , అమిత్ షా గుజరాత్ రాజకీయాల్లో కిందా మీదా పడుతున్నప్పుడు బీజేపీని నడిపించిన సీనియర్లు అందర్నీ ఇప్పటికే సైడ్ చేసేశారు. ఇప్పటికీ కేంద్ర పదవుల్లో ఉన్న గడ్కరీ, రాజ్ నాథ్ వంటి వారు .. మిణుకుమిణుకుమంటున్నారు. వారు ప్రధాని పదవి గురించి ఆలోచించే పరిస్థితులే లేవు.
మోదీ ఉన్నంత కాలం ఆయనే ప్రధాని అని బీజేపీ నేతలు చెుబతూంటారు. నిజానికి అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. కొత్త వారికి అవకాశాలు కల్పించాలి. మోదీ లేక ముందు కూడా దేశం ముందుకెళ్లింది.. మోదీ ఉన్నప్పుడూ కూడా.. మోదీ తర్వాత కూడా ప్రశాంతంగా దేశం ముందుకెళ్తుంది. వారు ఉన్నప్పుడే దేశానికి కొత్త నాయకత్వం అందించడం అసలైన పాలకుల లక్షణం. కానీ మోదీ.. తమ పార్టీలో తన వరకూ వచ్చే సరికి రూల్ ను అమలు చేయడానికి అంత సుముఖంగా లేరు. తానున్నంత వరకూ తానే కింగ్ అనే ఫిక్సయ్యారు.