దిల్ రాజు బ్యానర్లో రకూపొందించిన ‘లవ్ మీ’ మళ్లీ వాయిదా పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన సినిమా ఇది. ఎన్నికల హడావుడి వల్ల ఈనెల 25కు వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా వేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే… తెలంగాణలో సింగిల్ స్క్రీన్సన్నీ పది రోజుల పాటు ఆపేయాలని థియేటర్ల యాజమాన్యం నిర్ణయం తీసుకొంది. మే 31 వరకూ థియేటర్లు తెరచుకొనే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘లవ్ మీ’ విడుదల అవ్వడం కష్టం. కాకపోతే ఇది దిల్ రాజు సినిమా. ఆయన నైజాం రారాజు. దిల్ రాజు తలచుకొంటే ఈ సమస్యని పరిష్కరించగలరు కూడా.
కానీ థియేటర్లు తెరచుకొంటే సరిపోదు. ప్రస్తుతం ఆడియన్స్‌కు సినిమా చూసే మూడ్ ఉందా, లేదా? అనేది తెలుసుకోవడం కూడా ముఖ్యమే. ఎన్నికలు అయిపోయినా, ఐపీఎల్ గండం ఇంకా ఉంది. ఐపీఎల్ ప్రస్తుతం ప్లే ఆఫ్ దశకు చేరుకొంటోంది. ఈనెల 26న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆ రోజున యువత అంతా టీవీలకు అతుక్కుపోయే ఛాన్స్ వుంది. ఇలాంటి దశలో.. సినిమాని విడుదల చేయడం అంత మంచి ఆలోచన కాదు. అందుకే దిల్ రాజు ఈ సినిమాని మళ్లీ వాయిదా వేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రోజు ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా కొత్త డేట్ ఏమైనా బయటకు వస్తుందేమో చూడాలి. ఆశీష్ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ‘బేబీ’ ఫేమ్ వైష్ణవి కథానాయిక. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.