ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. ఆయన ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. ప్రశాంత్ కిషోర్ ఆలోచించలేనన్ని సీట్లు రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. పీకే ప్రస్తావన తీసుకు వచ్చి ఆయన అంచనాలు తలకిందులు అవుతాయని చెప్పడం కోసమే ఐ ప్యాక్జ్ ఆఫీసుకు వచ్చినట్లుగా ఉందన్న గుసగుసలు వినిపించాయి.
2014 ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత పీకేతో జగన్ ఒప్పందం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ అంతా తానై వ్యవహరించారు. వైసీపీని గెలిపించేది ప్రశాంత్ కిషోరేనని ప్లీనరీలో పార్టీ క్యాడర్ కు జగన్ చెప్పారు. ఎన్నికలు ముగిసిన రోజులోనే ఐ ప్యాక్ ఆఫీసుకు వెళ్లి పీకేను అభినందించారు. ఆ తర్వాత ఐ ప్యాక్ తరపున తమిళనాడు, బెంగాల్ లో డీఎంకే, టీఎంసీలకు పని చేశారు. అక్కడ కూడా ఆయన పని చేసిన పార్టీలకు విజయాలు సాధించి పెట్టారు. తర్వాత ఐ ప్యాక్ కార్యకలాపాల్లో పాల్గొనలేదు.
అయితే దేశంలో సుప్రసిద్ధమైన ఎన్నికల స్ట్రాటజిస్టుగా ఉన్న ఆయన ఇటీవల చాలా మీడియా సంస్థలకు ఇంటర్యూలు ఇచ్చారు. ఆ సమయంలో ఏపీలో వైసీపీ చాలా భారీగా ఓడిపోతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇలా చెప్పడంపై వైసీపీ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తోంది. జగన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిజానికి ఎన్నికలకు ఈ ఎన్నికలకు తేడా పీకేనే. గత ఎన్నికల్లో పీకే గెలిపించారని జగన్ కూడా ఒప్పుకున్నారు. ఈ సారి ఆ పీకే కూడా ఊహించలేనన్ని సీట్లు సాధిస్తామని చెబుతున్నారు.